Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల లాఠీ దెబ్బలకు ఉద్యమం ఆగదు
- ముదిగొండ అమరుల స్ఫుర్తితో పోరాడుతాం
- స్పష్టం చేసిన ఫిలిం సిటీ భూ బాధితులు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కె. భాస్కర్‌ను ఈడ్చుకెళ్లిన ఖాకీలు
- ఆగ్రహించిన బాధితులు, కార్యకర్తలు
- పేదలకు భూమి దక్కే వరకూ పోరాడుతాం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య, వీరయ్య
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను రామోజీరావుకు అప్పన్నంగా కట్టబెడుతామంటే ఊరుకునేది లేదని, పేదలకు భూమి దక్కే వరకూ పోరాడుతామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నాగన్‌పల్లి, పొల్కంపల్లి, రాయపోల్ గ్రామాలకు చెందిన ఇండ్లు లేని నిరుపేదల కోసం నాటి ప్రభుత్వం 2007లో నాగన్‌పల్లి రెవెన్యూ పరిధిలో 189, 203 సర్వే నెంబర్లో సుమారు 20 ఎకరాల్లో 600 మంది పేదలకు ఇంటి జాగాలు కేటాయించింది. ఈ జాగాలపై రామోజీరావు కన్నేసి కాజేయాలని చూస్తూ తమ జాగాలోకి రాకుండా అడ్డగిస్తున్నారని బాధితులు మండిపడ్డారు. ఈ జాగాలను పేదలకు ఇవ్వాలని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు సుమారు 1000 మందితో సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టేందుకు కుట్రలు చేస్తున్న రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ అధికారులు రామోజీరావుకు ఊడిగం చేయడం ఆపి.. పేదలకు న్యాయం చేయాలని, ప్రాణాలైనా ఇచ్చి తమ జాగాల కోసం పోరాడుతామని బాధితులు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించగా బాధితులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి భాస్కర్‌ను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఆగ్రహనికి గురైన భూ బాధితులు, సీపీఐ(ఎం) కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పోలీసు ఉన్నతాధికారుల జ్యోకంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. అనంతరం సీపీఐ(ఎం) బృందంతోపాటు బాధితులు జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఎనిమిదేండ్లు అయినా ఇప్పటికీ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు ఇంటి నిర్మాణాల కోసం ఇచ్చిన ఇంటి జాగాలు ప్రయివేటు వ్యక్తులకు అప్పన్నంగా అంటగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వం ముదిగొండలో ఏడు మంది ప్రాణాలు బలిగొన్న తరువాతే రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల జాగాలు పంపిణీ చేసిందని, ఇప్పుడు మీకు ఎన్ని ప్రాణాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశం ఉంటే ప్రాణాలు ఇవ్వడానికి ముందు వరుసలో ఉంటామని, తమను చంపి పేదలకు ఇండ్ల జాగాలు ఇవ్వండని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్‌బెడ్‌రూమ్‌ల కోసం రాష్ట్రంలో 40 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం కేవలం 3 లక్షల ఇండ్లు మాత్రమే నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఇందులో 36 వేలు ఇండ్లు పంపిణీ చేసిందని తెలిపారు. ఈ లెక్కన 40 లక్షల కుటుంబాలకు ఇండ్లు పంపిణీ చేయడానికి ఎన్ని తరాలు పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేయడానికి 10.50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ భూములన్నీ భూస్వాములు, వ్యాపారులు, రియల్ వ్యాపారుల కబ్జాలకు గురవుతున్నదని, వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి ఎందుకు చేతకావడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా భూస్వాములు, వ్యాపారుల చేతుల్లో మగ్గుతున్న పేదల ఇంటి జాగాలు స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టి అనుభవిస్తున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 కేంద్రాల్లో వేలాది మంది పేదలు ఇంటి జాగాల కోసం ప్రభుత్వ భూముల్లో గూడిసెలు వేసి నివాసం ఉంటున్నారన్నారు. ప్రభుత్వాలు ఉంది ప్రజల కోసం తప్పా బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి కాదని హెచ్చరించారు. తమ పట్టా జాగాలను తమకు కావాలని పోరాటం చేస్తున్న పేదలపై దాడులు చేయడం సరికాదన్నారు. పోలీసుల లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. పేదలకు భూమి దక్కే వరకూ పోరాడుతామన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె.భాస్కర్, కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీశ్, జిల్లా నాయకులు జంగయ్య, జగన్, తదితరులు పాల్గొన్నారు.