Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
- 2023 నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నవతెలంగాణ- దామరచర్ల
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుతో దేశానికి కీర్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు థర్మల్ పవర్ ప్లాంటుకు వచ్చారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ప్లాంట్‌లో తిరిగి పరిశీలించారు.
రూ.29.965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా నిర్మిస్తున్న 5 యూనిట్ల పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో అధికారులకు నిర్మాణ పనులపై దిశా నిర్దేశం చేశారు. త్వరితగతిన పనులను చేసి 2023 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంవత్సరం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా చూడాలని సూచించారు. ఇప్పటికే రెండు యూనిట్లు 90 శాతం, మిగతా 3యూనిట్లు 70 పనులు పూర్తి అయ్యాయి. కాగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ముందుకు పోవాలని చెప్పారు. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. దామరచర్ల నుంచి పవర్ ప్లాంట్ వరకు సుమారు 6 కిలోమీటర్ల వరకు పోలీసులను మోహరించారు. ప్లాంట్ గేట్ వద్ద కూడా భారీగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు.
జర్నలిస్టులకు నో ఎంట్రీ
సీఎం కేసీఆర్ పర్యటనను కవర్ చేయడానికి ప్లాంట్ వద్దకు వెళ్లిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను లోపలికి వెళ్లనివ్వలేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జర్నలిస్టులు ప్లాంట్ ఎదుట నిల్చోవాల్సి వచ్చింది. దీంతో జర్నలిస్టులు కొంత అసహనానికి గురయ్యారు.
ప్రత్యేక జిల్లా కోసం ఆందోళన
మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కొందరు సీఎం పర్యటన సంద ర్భంగా యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. అన్ని రకాలుగా అర్హతలు ఉన్న మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని బలవంతంగా అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు.