Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూముల హక్కుపత్రాలిచ్చేందుకు..
- శాటిలైట్ మ్యాప్‌ను ఆధారంగా తీసుకోవద్దు
- చట్టంలో ఉన్న అంశాల్నే తీసుకోండి..
- పలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏల ముట్టడి
నవతెలంగాణ-ఉట్నూర్/ఏటూరునాగారం
పోడు భూములకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చేందుకు శాటిలైట్ మ్యాప్‌ను ప్రధాన ఆధారంగా తీసుకోవద్దని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తుడుందెబ్బ, తదితర సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ముట్టడిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో టీఏజీఎస్ ఆధ్వర్యంలో ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ కార్యదర్శి ఎర్మ పున్నమ్ మాట్లాడుతూ పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. హక్కు పత్రాలు ఇచ్చేందుకు గతంలో తీసిన శాటిలైట్ మ్యాప్‌ను ప్రధాన ఆధారం చేసుకోవద్దని, చట్టంలో పొందుపరిచిన అంశాలను మాత్రమే ప్రధాన ఆధారంగా తీసుకొని హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన గ్రామాల్లో నామమాత్రపు గ్రామసభలు నిర్వహించారన్నారు. తిరస్కరణకు గురైన రైతులు పైకమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఆదివాసీ పోడు రైతులకు న్యాయం చేయాలని కోరారు. హరితహారం పేరుతో లాక్కొని ప్లాంటేషన్ చేసిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, ఒక రైతు ఎన్ని చోట్ల భూమి కలిగి ఉంటే అన్ని చోట్ల సర్వే చేసి హక్కుపత్రం ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు 3ఎకరాల భూమితో పాటు ఇంటి స్థలం లేని వారికి స్థలం కేటాయించి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రాజన్న, రమేష్, శ్రీనివాస్, లక్ష్మి, శంకర్, సమ్మయ్య, అంజయ్య, సతీష్, భారతి, పోడు రైతులు పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని వైజంక్షన్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, ఆదివాసీల సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రామ్మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కబ్బాక శ్రావణ్ మాట్లాడారు. పోడు భూములను ఆనాదిగా ఆదివాసీలు కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. అలాంటి ఆదివాసీలనే అక్రమదారులుగా అటవీశాఖ చిత్రీకరించడం బాధాకరమన్నారు. పోడు చేస్తున్న రైతులకు పెసా గ్రామ సభల్లో తీర్మానం చేసి వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా చలామణి అవుతున్న మంత్రి సత్యవతిరాథోడ్ ఎస్టీలకే అన్యాయం చేస్తోందన్నారు. ఐటీడీఏ పరిధిలో హక్కు వచ్చిన రైతులకు రైతు బంధు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5వేల మంది దరఖాస్తులు చేసుకున్నా ఇంత వరకు హక్కు పత్రాలు రాలేదన్నారు. పోడు భూములకు సర్వే చేపట్టి హద్దులు పాతాలని కోరారు. ఆదివాసీలకు ఎస్టీ ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ పొడెం రత్నం, ఏఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ, జిల్లా కార్యదర్శి మడకం చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి పాయం జానకిరమణ తదితరులు పాల్గొన్నారు.