Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ప్రశ్నించిన మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరందించుకోగలిగామని రాష్ట్ర ఎస్సీ అభివద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. నియోజక వర్గంలో పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు, కెనాల్స్ నిర్మాణాలను పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. బొమ్మరెడ్డిపల్లి కెనాల్‌కు సంబంధించి 94 ఎకరాలకు 44 ఎకరాల భూ సేకరణ పూర్తయిందనీ, ఇందుకు సంబంధించి నిధులు కూడా మంజూరయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. ముంజంపల్లి, ఉండేడు గ్రామాలు గోదావరి ఒడ్డునే ఉన్నప్పటికీ నీటి సౌకర్యం లేకుండా పోయిందని మంత్రి కొప్పుల అధికారులకు వివరించారు. మేడారం కుడి కాలువ సర్వే చేసి క్లియరెన్స్ ఇస్తామంటూ కొత్తగా చెప్పడమేంటని అధికారులను ఆయన ప్రశ్నించారు. వెలగటూరు, కమ్మర్పల్లి, ఎడవల్లిలో లిఫ్ట్ చేసిన పనులు 45 ఏండ్లు గడుస్తున్నా ఎందుకు చేపట్టడం లేదని అడిగారు. అంతేకాకుండా నియోజక వర్గంలో రూ.కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఎందుకు నిర్వహించ లేదంటూ నిలదీశారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ చేపట్టిన పనులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉంటుందనీ, ఇందుకు అధికారులు బాధ్యతగా సహకరించాలని సూచించారు. పత్తిపాక రిజర్వాయర్‌కు సంబంధించి అధికారులు ఏమైనా ప్రతిపాదన చేశారా? అని మంత్రి అడిగారు. మేడారం రిజర్వాయర్ నిర్మాణంతో బీమనపల్లి, చామనపల్లిలో ప్రజల ఇండ్లు కొట్టుకుపోయాయంటూ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 83 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని వివరించారు. 70 శాతానికిపైగా ఇండ్లలోకి నాలుగు ఫీట్ల లోతు వరకు నీరు వచ్చి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక పరమైన సమస్యలేంటో తెలుసుకుని చర్యలు చేపడతామంటూ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మంత్రికి హామీ ఇచ్చారు. అంబారిపేట ఆర్ఎస్పీ కెనాల్ పనులకు సంబంధించిన జీవో వచ్చిందనీ, టెండర్ ప్రక్రియ పూర్తయిందనీ, కొందరు గ్రామస్తులు అడ్డుకుంటున్నారనీ, అలైన్మెంట్ మార్చాలంటున్నారని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. గ్రామస్తులకు నష్ట పరిహారం పనులు ప్రారంభించాలంటూ అధికారులకు మంత్రి సూచించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న చెక్ డ్యాములు, కెనాల్స్, ఇతర ఇరిగేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలంటూ అధికార యంత్రాంగాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.