Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మారుస్తున్నాం
- ఎగుమతి చేసే రెండు శాతం సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు : ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామనీ, ఆ దిశగా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (2015 ఏప్రిల్ ఒకటి నుంచి 2017, జూన్ 30 వరకు) రెండు శాతం సీఎస్టీ పన్ను బకాయిని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేస్తే గతంలో సి-ఫారం దాఖలు చేస్తే (సీఎస్టీ) పన్నులో రెండు శాతం రాయితీని కల్పించేలా విధానం ఉండేదని తెలిపారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో అమలైందని వివరించారు. తెలంగాణలో కూడా ప్రారంభంలో అమలైందని గుర్తు చేశారు. 2015, ఏప్రిల్ ఒకటి నుంచి 2017, జూన్ 30 వరకు రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ-ఫారం దాఖలు చేయలేదనే కారణంతో ఎగుమతి దారులకు సీఎస్టీలో రెండు శాతం పన్ను రాయితీని నిలిపేశారని పేర్కొన్నారు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామంటూ రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారని తెలిపారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని రెండేండ్ల కాలానికి సంబంధించిన రెండు శాతం పన్నును రద్దు చేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారని వివరించారు. ఇదే విషయాన్ని సోమవారం దామరచర్ల పర్యటన సందర్భంగా మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కూడిన రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విజ్జప్తి చేశారు. న్యాయం జరిగేలా చూడాలంటూ విన్నవించుకున్నారు. ఇందులో కేవలం తెలంగాణ రైస్ మిల్లర్ల ప్రయోజనమే లేదనీ, దాంతోపాటు తెలంగాణ రైతాంగ ప్రయోజనం కూడా ఇమిడి ఉందనే విషయాన్ని గ్రహించామని సీఎం వివరించారు. తెలంగాణ అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించిడం ప్రభుత్వ కర్తవ్యంగా భావించామని తెలిపారు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసేందుకు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. రైస్ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎటువంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలనీ, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. అటు రైస్ మిల్లర్లకు ఇటు తెలంగాణ రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని సీఎం కోరారు. సీఎం ఆదేశాల మేరకు రెండు శాతం పన్ను రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీ చేసింది. జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌కు కలిసి ధన్యవాదాలు తెలిపారు.