Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ బైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర, బహిరంగ సభ నిర్వహించడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి బి విజయ్ సేన్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 'శాంతిభద్రతలను కాపాడేందుకు పిటిషనర్ పోలీసులకు ముందస్తు రూట్ మ్యాప్ ఇవ్వాలి. నాయకులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ మత విద్వేషపరమైన నినాదాలు చేయకూడదు. మతపర మనోభావాలను దెబ్బతీయకుండా పిటిషనర్ నిర్ధారించాలి. యాత్రలో పాల్గొనేవారు ఎలాంటి కర్రలు, ఆయుధాలు తీసుకెళ్లకూడదు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుంది. ప్రజా ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే పిటిషనర్లు నష్టపరిహారం చెల్లించాలి. భైంసా వై జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే పోలీసులు సమావేశానికి అనుమతించాలి' అంటూ హైకోర్టు షరతులు విధించింది. ఏదైనా కారణం చేత సభ, పాదయాత్ర నిర్వహించలేకపోతే షరతులతో తర్వాత రోజు నిర్వహించేందుకు పిటిషనరకి అనుమతి ఇచ్చింది. అత్యంత సున్నిత ప్రాంతమైన చార్మినార్ వద్ద బీజేపీ సమావేశం నిర్వహించిందనీ, భైంసాపై రాష్ట్రం ఎందుకు అభ్యంతరం చెబుతోందంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు కోర్టుకు నివేదించారు.