Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షర్మిల కేరవ్యాన్ ధ్వంసం చేసి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు
- పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్విన టీఆర్ఎస్ కార్యకర్తలు
నవతెలంగాణ-చెన్నారావుపేట
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో సోమవారం ఉధ్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. షర్మిల ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా ఆమె ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డినిద్దేశించి... అభివృద్ధిలో పెద్దిది చిన్నబుద్ది అని, భూ దందాలో పెద్ద బుద్ది అని విమర్శించారు. అవే వ్యాఖ్యలు సోమవారం కూడా కొనసాగడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రపై దాడికి యత్నించా రు. 'షర్మిల గోబ్యాక్' అంటూ నినాదాలు చేయడంతో టీఆర్ఎస్, వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పరస్పరం దూషణలు, దాడులకు దిగడంతో పాటు పాదయాత్ర బస్సును తగలబెట్టేందుకు యత్నించి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ గూండాలను అరెస్టు చేయాలంటూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు రోడ్డుపై బైటాయించి భారీఎత్తున రాస్తారోకో చేశారు. దాంతో భారీగా పోలీసులు మోహరించడంతో పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా షర్మిల నినాదాలు చేశారు. దాంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలోనే షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసినట్ట్టు తెలుస్తోంది.
దాడి అప్రజాస్వామికం :గట్టు రామచందర్రావు
వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిలపై నర్సంపేటలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అప్రజాస్వామిక దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచందర్రావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందున్నే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు.