Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ మహిళలపై అఘాయిత్యాలపై స్పందించాలి
- జాతీయ ఎస్సీ కమిషన్ వైస్‌చైర్మెన్ అరుణ్ హల్దర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎస్సీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోలీసులు తక్షణం స్పందించాలనీ, కేసులను కఠినంగా నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మెన్ అరుణ్ హల్దర్ అన్నారు. ఈ విషయంలో పోలీసులు తమ తీరును తప్పనిసరిగా మార్చుకోవాల్సిందేనని చెప్పారు. సోమవారంనాడిక్కడి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలపై దాడులు, అఘాయిత్యాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉన్నదనీ, ఉత్తరప్రదేశ్‌లోనూ కేసుల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో ఈ ఏడాదిలో 26 అట్రాసిటీ కేసుల్లో 22 కేసుల్లో తక్షణం న్యాయం లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైంగికదాడి, మోసం కేసుల్లో మూడ్రోజుల్లో చర్యలు తీసుకోవాలనీ, నిందితులను అరెస్టు చేయాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దేశంలోని గ్రామాల్లో ప్రధానంగా భూ సమస్య ద్వారానే ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూసేకరణలో వారికి నష్టపరిహారం ఇచ్చే విషయంలో అన్యాయం జరుగుతున్నదన్నారు. సేకరించిన భూమిని ప్రభుత్వాలు ప్రయివేటు సంస్థలకు అమ్ముకుంటున్నాయనీ, అందువల్ల బాధితులకు మెరుగైన పరిహారాలు అందించాల్సిందేనని స్పష్టంచేశారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే దాన్ని సుమోటోగా స్వీకరించడంపై ఆలోచిస్తామన్నారు.