Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ సంరక్షణ నిబంధనలను ఉపసంహరించుకోవాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం ఆమె చేతనే ఆదివాసీల కన్నుపొడిచేలా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యవర్గ సమావేశాన్ని ఆ సంఘం నాయకులు కుటుంబరావు సోమవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అటవీ సంరక్షణ నిబంధనలకు అనుమతించేలా చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ నిబంధనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా కార్పొరేట్ సంస్థలకు అడవులు, ప్రకృతి సంపదను కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నదనీ, ఆదివాసీలకు కనీసం అడవిలో జీవించే హక్కు కూడా లేకుండా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆదివాసీల ఉనికినే ప్రశ్నార్థకం చేసే అత్యంత ప్రమాదరకరమైన తిరోగమన చర్య అనీ, అటవీ సంరక్షణ నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తుల పరం చేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. అటవీ సంరక్షణ నిబంధనల పేరుతో పాత చట్టాలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని అన్నారు. గిరిజనులు, గ్రామసభలు, రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం లాగేసుకుంటున్నదని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తిపై మరోసారి దాడి జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, జువారి రమేష్, భూక్యా శ్రీనివాస్, శంకర్, స్వరూప, దస్రు తదితరులు పాల్గొన్నారు.