Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు
నవతెలంగాణ- కాప్రా
హైదరాబాద్ ఉప్పల్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో కొన్నాళ్లుగా అంతర్గతంగా రగులుతున్న విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయి.. రౌడీలు, గుండాలతో తనను చంపిస్తానని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి బెదిరిస్తున్నారని ఆ పార్టీ చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాప్రా సర్కిల్ కుషాయిగూడలో రూ.54 లక్షలతో మరమ్మతులు చేసి, కొత్త మిషనరీతో మోడల్ దోబీఘాట్‌ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్‌ను అయిన తాను లేకుండా దోబీఘాట్‌ను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. బీసీ మహిళా కార్పొరేటర్‌ను అయిన తనను మర్యాద లేకుండా ఎమ్మెల్యే దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఇతర మహిళల వద్ద తన గురించి పిచ్చి పిచ్చి మాటలు, బూతులు మాట్లాడుతున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని కార్పొరేటర్ హెచ్చరించారు. తనను నాన్ లోకల్ అని ముద్ర వేసి కులం పేరుతో అవమానిస్తే ఊరుకోబోమన్నారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, తనపై నిత్యం అసత్య ఆరోపణలు, బూతులు తిడుతున్న వైనంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.