Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి రచించిన 'ఇక ఇప్పుడు' కవితా సంకలానికి ఆచార్య వాసిరెడ్డి భాస్కర్ స్మారక సాహిత్య పురస్కారం దక్కింది. వరంగల్ ఆర్సీటీఎస్ భవనంలో అభ్యుదయ రచయితల సంఘం వరంగల్ శాఖ అధ్యక్షులు నిధి అధ్యక్షతన సభ జరిగింది. అందులో రచయిత కె.ఆనందాచారి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బన్న అయిలయ్య మాట్లాడుతూ...ఆనం దాచారి ఒకే సిద్ధాంతానికి 40 ఏండ్లుగా కట్టుబడి ఉన్న గొప్ప వ్యక్తి అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని రచనల రూపంలో సమాజానికి చేరవేస్తున్నారని కొనియాడారు. ప్రముఖ కవయిత్రి సీహెచ్. సుమిత్ర మాట్లాడుతూ..'ఇక ఇప్పుడు' కవితా సంపుటిని పరిచయం చేశారు. ఆనందాచారి కవిత్వంలో సరళత, తాత్వికత స్సష్టంగా కనిపిస్తాయ న్నారు. ఆయన స్వేచ్ఛ, ప్రేమను అమితంగా కోరుకున్నారని తెలిపారు. ఈ సభలో అరసం రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్, జిల్లా కార్యదర్శి పల్లేరు వీరస్వామి, వేల్పుల నారాయణ, శంకర్ నారాయణ, శ్రీనివాస్, వాసిరెడ్డి కృష్ణారావు, ఎం. దామోదర్, బిల్లా మహేందర్, తెలంగాణ సాహితీ వరంగల్ కన్వీనర్ కె.చంద్రమౌళి, నాయకులు జి.కరుణాకర్, టి.ఆనందాచారి, తదితరులు పాల్గొన్నారు.