Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్
- హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
పేద ప్రజల కోసం ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల పోరాట వేదిక హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. సైదాబాద్, బండ్లగూడ, చార్మినార్, బహుదూర్ పురా, గోల్కొండ, నాంపల్లి, ఆసిఫ్‌నగర్ తదితర మండలాల్లో ఇండ్లు లేని పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ సోషీయో ఎకనామికల్ సర్వే (ఎస్.ఈ.ఎస్) నిర్వహించి కలెక్టర్ హౌసింగ్ సొసైటీకి పంపారని, అక్కడ ఏండ్లుగా పెండింగ్‌లో ఫైల్స్ ఉన్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో అధికారులు మళ్లీ విచారణ చేశారు కానీ ఇండ్ల పంపిణీ మాత్రం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వాంబే స్కీంలో కానీ, జెఎన్‌యుఆర్‌ఎం, డబుల్ బెడ్ రూమ్ స్కీముల్లోగానీ ఇండ్లు ఇస్తారని ఎదురుచూస్తున్నారని, కానీ ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. ఇంటి కిరాయి చెల్లించలేక పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే లబ్దిదారులందరికీ ఇండ్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇలానే ఆలస్యం చేస్తే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ్ కుమార్, మీనా, ఐద్వా నాయకులు పి.శశికళ, ఆవాజ్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్, సీఐటీయూ నాయకులు పి.నాగేశ్వర్, డీవైఎఫ్ఐ నాయకులు ఏ.కృష్ణ, వి.రాంకుమార్, విఠల్, జంగయ్య, ప్రజలు పాల్గొన్నారు.