Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభోత్సవాలకు వడివడిగా అడుగులు..
- జనవరి 18న నూతన సచివాలయం.. ఫిబ్రవరిలో అంబేద్కర్ విగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏ విషయంలోనైనా తనదైన శైలి, ముద్ర కనిపించాలని భావించే సీఎం కేసీఆర్... అందుకనుగుణంగా నూతన సంవత్సరం (2023)లో 'తన మార్క్'ను చూపించబోతున్నారు. అందుకనుగుణంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వైభవానికి ప్రతీకగా నిలవబోతున్న నూతన సచివాలయాన్ని జనవరి 18న ఆయన ప్రారంభించబోతున్నారు. కొత్త సెక్రటేరియట్‌కు ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసిన సంగతి విదితమే. మరోవైపు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో నిర్మించబోతున్న 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత విగ్రహ (అంబేద్కర్‌్ స్మృతివనం) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆయా పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. సీఎం ఆదేశాల మేరకు వారు నిర్మాణ సంస్థలకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలంటూ ఆదేశించారు.
వచ్చే ఏడాది డిసెంబరులో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమైన, ప్రాధాన్యతగల పనులన్నింటినీ ఆ సంవత్సరం ప్రథమార్థంలో పూర్తి చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో సైతం వాటిని ఆయన ప్రస్తావించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో వైద్య కళాశాల, కాళేశ్వరం సహా వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే క్రమంలో సోమవారం నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో నిర్వహించతలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను కూడా ఆయన పర్యవేక్షించారు. పనిలో పనిగా నిజామాబాద్‌లో నూతన బస్టాండు నిర్మాణానికి కూడా మంత్రులు, అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ రకంగా అన్ని నిర్మాణాల్లోనూ తనదైన ట్రేడ్ మార్క్‌ను కేసీఆర్ ప్రదర్శించబోతున్నారు. కాగా నూతన సచివాలయంలోని ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం, పేషీ కొలువుదీరనున్నాయి. కేసీఆర్ అక్కడ అడుగు పెట్టిన తర్వాత మిగతా మంత్రుల, అధికారుల ఛాంబర్లను ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.