Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశం గర్వించదగిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు తెలిపారు. సోమవారం ఫూలే వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ 1890 నవంబర్ 28న ఫూలే మరణించాడనీ, అయితే ఆయన చూపిన మార్గం మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. స్వతంత్ర దృష్టి, సమగ్ర దృక్పథం, ఆధునిక సమాజపు ఆకాంక్షకు ప్రతీక పూలే అని చెప్పారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు జీవితాంతమంతా ప్రత్యక్ష అనుభావాలతో నిండి ఉన్నదని తెలిపారు. కులవివక్షను ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన, తాను ఎదుర్కొన్న అవమానాలను రూపుమాపడానికి తుది శ్వాస వరకు కృషి చేశాడని చెప్పారు. ఒక బ్రాహ్మణ మిత్రుడి వివాహ ఊరేగింపులో పాల్గొన్నందుకు బ్రాహ్మణులు ఆయన పట్ల చూపిన వివక్షతో కంటనీరు పెట్టాడని తెలిపారు. వితంతువు పునర్వివాహాలు, అస్పృశ్యులకు విద్య, పేదల సంక్షేమం కోసం తుది శ్వాస వరకు ఫూలే దంపతులు కృషి చేశారన్నారు. ఇలాంటి అంతరాలను అంతం చెయ్యడానికి శూద్ర, అతి శూద్ర ప్రజలకోసం జీవితాన్ని అంకితం చేయాలనీ, బ్రాహ్మణీయ ఆధిపత్య భూస్వామ్య వ్యవస్థను అంతం చెయ్యకపోతే శూద్రుల మనుగడకు ప్రమాదం ఉందంటూ ఆయన గుర్తించారని గుర్తుచేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నూతన విద్యావిధానం ముసుగులో కాషాయికరణ, కార్పొరేటీకరణను జొప్పించడం ద్వారా మార్చి మెజార్టీ ప్రజలకు విద్యకు దూరం చేస్తున్నదని తెలిపారు. ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఎ వెంకటేశ్ ప్రసంగించారు. కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంటేపోగు రాజు రాష్ట్ర కమిటీ సభ్యులు , బొరుసు మారన్న, పరంజ్యోతి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.