Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
కేసీఆర్ నగర్లో లబ్ది పొందిన లబ్దిదారులు ఇండ్లు కిరాయి ఇస్తే, తాళం వేస్తే.. వాపస్ తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్లో 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణ పనులు, కేసీఆర్ నగర్ పోచమ్మ దేవాలయ ఆవరణలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, కేసీఆర్ నగర్-గుండ్ల చెరువులకు 1.50లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంక్ పనులకు సోమవారం మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయడంతో పాటు పోలీసు ఔట్‌పోస్ట్‌ను ప్రారంభించారు. అదేవిధంగా రెడ్డి సంక్షేమ భవన్లో పట్టణంలోని 300 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే పేద ప్రజలకు గృహ సముదాయం కేవలం సిద్ధిపేటలోనే ఉన్నదని అన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. ఆదర్శవంతమైన చక్కటి కాలనీ నిర్మించి ఒక్కొక్కటిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, 2450 ఇండ్ల కాలనీ తక్కువ సమయంలో తీర్చిదిద్దుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీ ఏర్పాటయ్యాక అంగన్ వాడీ, రేషన్ షాపు, పాఠశాల, నీటి ట్యాంక్‌లతో పాటు అదనంగా 1.50లక్షల లీటర్ల మూడవ నీటి ట్యాంక్ పనులు ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. లో ఓల్టేజీ లేకుండా రూ.5.42 కోట్లతో 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్టు, పట్టణంలో ఇది 7వ సబ్ స్టేషన్నని, నియోజకవర్గంలో 44వ సబ్ స్టేషన్ అని తెలిపారు. పోలీసు ఔట్ పోస్ట్‌తో ఇక్కడి ప్రజలకు భద్రత ఉంటుందని అన్నారు. మరో వెయ్యి ఇండ్ల నిర్మాణం ప్రారంభం చేస్తున్నట్టు తెలిపారు. ఎల్అండ్ టీ శిక్షణా కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగం సైతం ఇప్పిస్తామని తెలిపారు. త్వరలోనే గ్రూప్-4 కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కాలనీగా పెద్దలు సహకరించాలని కేసీఆర్ నగర్ కాలనీ వాసులను కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, మాజీ మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు, సుడా చైర్మెన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.