Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ఎన్నికలపై ఊహాగానాలు
- అధికార టీఆర్ఎస్ వ్యూహంపై సర్వత్రా చర్చ
- ఆర్నెల్లలో ఎన్నికలంటూ గుసగుసలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు. తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి...' టీఆర్ఎస్కు సంబంధించిన వివిధ సమావేశాల్లో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పిన మాటలివి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వివిధ వేదికల మీద ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు ఆ పార్టీకే చెందిన కొందరు సీనియర్లు. వారి అంచనాల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం... కేసీఆర్ శాసనసభకు రద్దు చేసి ముందస్తుకు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తున్నది. ఇందుకనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలకు సమాయత్తమవుతున్నట్టు వినికిడి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలందరూ ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలనీ, కిందిస్థాయిలో విబేధాలను పక్కనబెట్టి నాయకులందరూ జనంతో మమేకం కావాలని టీఆర్ఎస బాస్ ఆదేశించారు. ఆత్మీయ సమవేశాల పేరిట ప్రజల్లోకి వెళ్లాలంటూ సీఎం వారికి సూచించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ను విడిచి తమ తమ నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో వారు నిమగం కావటమే ఇందుకు నిదర్శమని గులాబీ పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
మరోవైపు వచ్చే నెలలో వివిధ పథకాలు, కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల పేరిట సీఎం జిల్లాల్లో వరుసగా పర్యటించనున్నారు. ఆ సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించటం ద్వారా ఆర్థికాంశాలపై కేంద్రం పెత్తనం, ఆ పేరిట రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, సహాయాలకు కోతలు పెట్టటం, కొర్రీలు వేయటం తదితరాంశాలను కేసీఆర్ ఏకరువు పెట్టనున్నారు. ఆ రకంగా తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ వైఖరిని ఆయన ఎండగట్టనున్నారని సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు తెలిపారు. ఇంకోవైపు ప్రస్తుత నెల్లోనే వరసగా రెండు నోటిఫికేష్లను సర్కారు విడుదల చేసింది.
వాటి ద్వారా మొత్తం 25 వేల పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. వీటిలో 16 వేల పై చిలుకు పోస్టులకు సంబంధించిన ప్రకటనను సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం వెలువరించటం గమనార్హం. ఇటీవల సీఎం... రాష్ట్రంలోని రోడ్లు, భవనాలు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, సాగునీటి పారుదల ప్రాజెక్టులు తదితరాంశాలపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ పరిణామాలన్నీ 'ముందస్తు'కు సంకేతాలంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రస్తావిస్తారంటూ టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్‌కు దగ్గరగా ఉండే సీనియర్లందరూ 'ముందస్తు' వాదనలను బలపరుస్తుండగా... కేటీఆర్‌కు దగ్గరగా ఉండే జూనియర్లు మాత్రం వాటిని కొట్టిపడేస్తుండటం గమనార్హం. మరో రెండు మూడు నెలల్లో వీటన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశముంది.