Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2.5కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ నిర్మించే దిశగా ప్రణాళిక
- అక్కడే ఎయిర్పోర్ట్ లగేజ్ చెకిన్ ఉండేలా ఏర్పాట్లు
- ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ కనెక్టివిటీతో వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్
- అయిదేండ్లుగా విజయవంతంగా నడుస్తున్న మెట్రో రైలు
- హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
- ఘనంగా మెట్రో రైల్ 5వ వార్షికోత్సవం
నవతెలంగాణ-సిటీబ్యూరో
శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో 2.5 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ మెట్రో రైలు మార్గం నిర్మాణం చేయనున్నట్టు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సెకండ్ ఫేజ్‌లో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లో భాగంగా ఈ నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇక్కడే ఎయిర్పోర్ట్ లగేజ్ చెక్ ఇన్ ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమై ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా అమీర్‌పేట మెట్రో స్టేషన్లో మంగళవారం హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జానపద గీతాలు, ఒగ్గుకళాకారుల నృత్యాలు, సితార్, సరోద్ ప్రదర్శనలు జరిగాయి. అనంతరం మీడియా సమావేశంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు.
2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించామని, మొదటి రోజునే రెండు లక్షల మంది ప్రయాణించి దేశ చరిత్రలో రికార్డు సృష్టించారన్నారు. ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న తరుణంలో కొవిడ్ ఊహించని నష్టాన్ని తీసుకొచ్చిందని, 6 నెలలపాటు మెట్రో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఎల్అండ్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎల్అండ్టీ గట్టిగా నిలబడి ప్రజలకు మెరుగైనా రవాణా అందిస్తుండటం అభినందనీయమన్నారు. ఐదేండ్లు పూర్తయిన తరుణంలో సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4.40 లక్షల మంది ప్రయాణించారని, భవిష్యత్తు లో ఇంకా పెరిగే అవకాశముందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో(పీపీపీ) నడిచే మెట్రో రైళ్లు లేవని.. ఒక్క హైదరాబాద్‌లోనే ఉందని తెలిపారు. నగరానికి మెట్రో రైలును తీసుకొస్తానని చెబితే అప్పట్లో ఎవరూ నమ్మలేదని.. కానీ పట్టుదలతో, ప్రభుత్వాల సహకారంతో తీసుకొచ్చామని చెప్పారు.
రెండో ఫేజ్‌లో భాగంగా రూ.6,250 కోట్లతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. వచ్చే నెల 9న ఈ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, పనులు పూర్తయితే హైదరాబాద్ మెట్రో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నగరాల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నారు. నాగోలు- రాయదుర్గం బ్లూలైన్ కారిడార్ అనుసంధానంగా ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ నిర్మాణం ఉంటుందని, రాయదుర్గం స్టేషన్‌కు సుమారు 0.9 మీటర్ల ముందు ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి బయోడైవర్సిటీ, ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ మీదుగా ఔటర్‌రింగ్ రోడ్డు పక్క నుంచి పనులు చేపడతామన్నారు. ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం సమయంలో మెట్రో అవసరాలకు 500 అడుగుల స్థలాన్ని రైట్వే కింద వదిలేయడంతో పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పార. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో 28.5 కిలోమీటర్లు మెట్రో పిల్లర్లపై ట్రాక్ వెళ్తుందని, మిగతా 2.5 కిలోమీటర్లు శంషాబాద్ వద్ద అండర్ గ్రౌండ్ ట్రాక్ ఉంటుందని వివరించారు. ప్రయాణికులు రాయదుర్గం స్టేషన్లోనే లగేజీలను ఒకేసారి చెకిన్ చేసుకోవడం ద్వారా ఎయిర్‌పోర్టులో ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.
ఎంజీబీఎస్ స్టేషన్ ప్రారంభ సమయంలోనే సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం రైలు నడిపిస్తే బాగుంటుందని తనతో చెప్పారని, అనుకున్న విధంగా ప్రభుత్వం ముందుకురావడం సంతోషకర మన్నారు. రెండో దశ పనులకు కేంద్రం సహకారం అందించినా.. అందించకపోయనా తామే పనులు చేపడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు.
5ఏండ్లు.. 31 కోట్ల మంది ప్రయాణం
మెట్రో ప్రారంభమైన ఈ ఐదేండ్ల కాలంలో మెట్రో మూడు కారిడార్లలో దాదాపు 31 కోట్ల మంది ప్రయాణం చేసినట్టు ఎల్అండ్టీ సీఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో సమయపాలనతో ప్రతిరోజూ రైళ్లను నడిపిస్తున్నామని, మెట్రో సూపర్ సేవర్, హాలీడే, టాప్ అప్ కార్డులు, ఫోన్‌పేతో మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. ఆన్లైన్ టికెటింగ్ ద్వారా 40 శాతం మంది రాకపోకలు సాగిస్తున్నారని, సూపర్ సేవల్లో సర్వర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కియోలిస్ సంస్థ సహకారంతో ప్రయాణికులకు సులభతర టికెటింగ్‌ను అందిస్తున్నామన్నారు. అనంతరం మెట్రో ప్రయాణాలు చేస్తున్న మొదటి 15 మందిని, ఫోన్‌పే ద్వారా టికెట్ బుక్ చేసుకుని ప్రయాణిస్తున్న మరో 10 మందిని రూ.10 వేల పారితోషికం, మెమెంటోతో సత్కరించారు. ఈ సమావేశంలో కీయొలిస్ సీఈవో బెర్నార్డ్ టాబెరీ, ఫోన్‌పే డైరెక్టర్ రితురాజ్ రౌతేజా తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి..?
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) ఎండీగా ప్రభుత్వం బహుషా తననే నియమించే అవకాశాలు ఉన్నట్టు ఎన్వీఎస్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. నగరంలో తొలిదశలో 69.9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణాన్ని విజయవంతంగా తన హయాంలో పూర్తయిందని.. రెండో దశలో ప్రభుత్వం రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు చేపట్టనున్న 31 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌కు తనకే బాధ్యతలు అప్పజెప్పవచ్చునన్నారు.