Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో నిర్మించిన నీరా కేఫ్ త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు .. మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో నీరా పాలసీలో భాగంగా నీరా కేఫ్ ప్రారంభోత్సవం, ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్, చిల్లింగ్ కేంద్రాల నిర్మాణ పనులపౖౖె అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాటి, ఈత చెట్ల పైనుంచి పడి శాశ్వత అంగవైకల్యం చెందిన గీత కార్మికులకు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ బోర్డ్ ముగ్గురు డాక్టర్లు ఇచ్చే సర్టిఫికెట్ల జారీని సులభతరం చేయాలని ఆదేశించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి సర్టిఫికెట్లను ఆర్థోపెడిక్ అసిస్టెంట్ సర్జన్ ఇచ్చేలా నిబంధనలు సవరించాలని సూచించారు. రైతు బంధు మాదిరిగా సాధారణ మరణం సంభవించిన గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అబ్కారీ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. నీరా ఉత్పత్తి, సేకరణపై సర్వేల్, చారుకొండ, మునిపల్లెలో నిర్మిస్తున్న నీరా చిల్లింగ్ ప్లాంటు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అజరు రావు, డేవిడ్ రవికాంత్, దత్తరాజ్ గౌడ్, చంద్రయ్య, సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజరు భాస్కర్ గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.