Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతి తక్కువ ఎంఎంఆర్‌లో దేశంలోనే మూడో స్థానం
- శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులిటెన్ ప్రకారం ...56 నుంచి 43కు తగ్గుదల
- వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాత మరణాల రేషియో (మెటర్నల్ మోర్టాలిటీ రేషియో) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) బులిటెన్ 2018-20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017-19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలతో 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. వామపక్ష ప్రభుత్వ పాలనలో ఉన్న కేరళ మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు. 2017-19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 49 పాయింట్స్ తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా.. 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్ల తగ్గుదల నమోదు కావడం గమనార్హం. కేసీఆర్ కిట్‌తో గర్భిణుల నమోదు, పర్యవేక్షణ పెరగడం, ప్రతి నెలా పరీక్షలు, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు, ఎనిమియా సమస్య ఉన్న వారిని గుర్తించి సప్లిమెంటరీ టాబ్లెట్ల పంపిణీ, ప్రతి గర్భిణీకి విధిగా ఐరన్ క్యాప్సుల్స్ ఇవ్వడం, హై రిస్క్ గర్భిణులను ముందే గుర్తించి పెద్దాస్పత్రికి రెఫర్ చేయడం తదితర చర్యలు మరణాలు తగ్గేందుకు దోహదం చేశాయి.
వెనుకబడ్డ డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు
ఎంఎంఆర్ తగ్గుదలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనుక బడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న మొదటి మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. తాజా నివేదిక ప్రకారం, ఎంఎంఆర్‌లో అస్సాం 195, మధ్య ప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదైంది. 2017-19 నుంచి 2018-20 ఎంఎంఆర్ తగ్గక పోగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లో10 పాయింట్లు, హర్యానాలో 14 పెరగగా, ఉత్త ర్ప్రదేశ్లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు.
సిబ్బందికి అభినందనలు....మంత్రి హరీశ్ రావు
ఎంఎంఆర్ తగ్గించడానికి కృషి చేసిన వైద్యాధికారులు, సిబ్బందిని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ఈ కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.