Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్)
నవతెలంగాణ-చండ్రుగొండ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామపంచాయతీ ఎర్రబోడు గ్రామ ఆదివాసీలను గ్రామ బహిష్కరణ చేయడం సరికాదని, వలస ఆదివాసీల పట్ల వివక్ష చూపడం తగదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వజ్జా సురేష్, సరియం కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎర్రబోడు ఆదివాసీ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకరిద్దరు చేసిన తప్పుకు గ్రామాన్ని బహిష్కరించడం సరికాదన్నారు. గ్రామసభ చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. రేంజర్ శ్రీనివాసరావు హత్య జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రేంజర్ మరణించడం బాధాకరమని, దానికి కారకులైన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆ సంఘటన కారణంగా చూపించి ఆదివాసీ గ్రామాన్ని వెలి వేయడం సరికాదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను ఆదివాసీల అభివృద్ధి కోసం ఉపయోగపడాలే తప్ప వారిని అణిచివేయడానికి కాదని చెప్పారు. ఎర్రబోడు గ్రామ ప్రజలకు ఆధార్, ఓటర్ కార్డులు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు అన్నీ ఉన్నాయని, బలవంతంగా గ్రామాన్ని ఖాళీ చేయించాలని చూడటం తగదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వలస ఆదివాసీల పట్ల మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గౌరీ నాగేశ్వరరావు, మడివి రమేష్, ముక్తి రామకృష్ణ, కాకా హనుమంతు, పోడియం వెంకటేశ్వర్లు, కాకా పాపారావు, అదేం కూర అయ్యి గుర్రాయి గూడెం సర్పంచ్ కాక సీత పాల్గొన్నారు.