Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ఆలోచనలను మరల్చే ఎత్తుగడలో భాగం
- ఎన్పీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి : పి.రాజారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తీవ్ర ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు ప్రజలు వాటివైపు ఆలోచించకుండా చేయడంలో భాగంగా పెట్టుబడిదారీ దేశాలు కుట్రపూరితంగా యుద్ధాలను సృష్టిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు అన్నారు. దేశంలో ట్రేడ్ యూనియన్లపై నిర్బంధం పెరుగుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజలను అట్టిపెట్టుకుని పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికోద్యమ నేత నండూరి ప్రసాదరావు పోరాటస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో కార్మికోద్యమ నేత నండూరి ప్రసాదరావు 22వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రాజారావు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ...ఎన్పీఆర్ విద్యార్థి, రైతాంగ, కార్మిక పోరాటాలకు నేతృత్వం వహించారని గుర్తుచేశారు. ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళాలకు శిక్షణ ఇచ్చిన వ్యక్తుల్లో నండూరి ఒకరని చెప్పారు. ట్రేడ్ యూనియన్ల నాయకత్వం అంకితభావంతో నిరంతరం ప్రజల్లో ఉండాలనీ, వారి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ రమ, జె.వెంకటేశ్, మధు, ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి, రాష్ట్ర నాయకులు సుధాకర్, యాటల సోమన్న, సునిత, తదితరులు పాల్గొన్నారు.