Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా నిలిచిన హైదరాబాద్ ప్రపంచంలో మొదటి 25 నినాసయోగ్య నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఇన్షియేటివ్ ఆఫ్ రీప్లానెట్ అనే అంశంపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రతి రోజు 6 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నామని తెలిపారు. వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి చేసేందుకు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 142 మున్సిపాల్టీల్లో ఎఫ్ఎస్డీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తెలంగాణకు జీడీపీ 45 శాతంపైగా పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్నదని తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇటీవల కాలంలో క్లౌడ్ బరెస్ట్తో ఒకే చోట భారీ వర్షపాతం నమోదవుతుందని గుర్తు చేశారు. డ్రై వేస్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. అన్ని మున్సిపాల్టీల్లో సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దోమకొండ పోర్ట్, కులీకుతుబ్ షా పోర్టు యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. తెలంగాణలో 118 పురాతన కట్టడాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో పట్టణీకరణ జరుగుతున్న నగరాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు జయేష్ రంజన్, దానకిషోర్తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.