Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంటా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీఏసీఎస్ సిబ్బంది
- అధికారులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తహసీల్దార్
- తహసీల్దార్‌తో పాటు పీఏసీఎస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
- రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన ప్రతిపక్షాలు
నవ తెలంగాణ-మద్దూరు
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం పోసి నిరసన తెలిపారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న రైతులు నారదాసు బాలకృష్ణ, బొల్లు చంద్రయ్య, కుక్కల లక్ష్మయ్య, పైసా పోచమ్మ, కుక్కల కనకవ్వ మాట్లాడుతూ.. గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసేందుకు స్థలం లేదన్నారు. కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న ఇతరుల భూమిలో సుమారు 35 ట్రాక్టర్ల ధాన్యాన్ని పోసుకొని ఆరబెట్టామని తెలిపారు. తమ ధాన్యాన్ని కాంటా పెట్టాలని పీఏసీఎస్ అధికారులకు విన్నవిస్తే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని పేర్కొంటు న్నారని తెలిపారు. కిలోమీటర్ దూరంలో ఉన్న ఇతరుల ధాన్యాన్ని కాంటా పెట్టిన అధికారులు తమ ధాన్యాన్ని ఎందుకు కాంటా పెట్టరని నిలదీసినా స్పందించలేదన్నారు. కాంటా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీఏసీఎస్ అధికారులపై సోమవారం తహసీల్దార్ భూపతికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంగళవారం గాగిల్లాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ పరిశీలించి ఏమీ మాట్లాకుండా వెళ్లారన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం పోసి నిరసన తెలిపినా అధికారులు కుర్చీలకే పరిమితమయ్యారని ఆరోపించారు. తహసీల్దార్ ఛాంబర్లో ధాన్యం పోసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోని తహసీల్దార్, పీఏసీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ భూపతి మాట్లాడుతూ.. రెండు రోజుల్లో ధాన్యాన్ని కాంటా పెట్టిస్తానని హామీ ఇచ్చారు. కాగా, రైతుల నిరసనకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, బీజేవైఎం మద్దూరు మండల అధ్యక్షులు యామ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టమైన కనక చంద్రం సంఘీభావం తెలిపారు.