Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
- తెలంగాణాలో రైతు సంఘాన్ని బలోపేతం చేయాలి : ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా
నవతెలంగాణ - నల్లగొండ
''నినాదాలతో ఐక్యత రాదని కలిసి పనిచేసి పోరాడితే ఐక్యత వస్తుంది.. రాష్ట్రంలో రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రతి గ్రామంలో సంఘం ఏర్పాటు చేసి.. ప్రతి రైతునూ సభ్యునిగా చేర్చుకోవాలి.. సభ్యత్వం నమోదులో కేరళ రాష్ట్రం అత్యధికంగా చేసింది.. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'' అని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా పిలుపునిచ్చార. నల్లగొండలో జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ ముగింపు సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. సంఘం విశిష్టతను తెలియజేసి.. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.
రైతులు ఏకమైతే మోడీ ప్రభుత్వం పతనం.. : ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు నంద్యాల
దేశంలో రైతులు, రైతు సంఘాలు ఏకమైతే మోడీ ప్రభుత్వం పతనం ఖాయమని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్ముతూ.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తోందని చెప్పారు.
గిరిజన రైతుల్లో 80శాతం సన్న, చిన్నకారులే.. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్నాయక్
గిరిజన రైతుల్లో నూటికి 80శాతం సన్న, చిన్నకారు రైతులుగానే మిగిలిపోతున్నారని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. తండాల్లో జీవనాధారం లేక గిరిజన రైతులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిం దన్నారు. కౌలు రైతులు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూముల రైతులకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్వామినాథన్ సిఫార్సుల అమలుకు సంఘటిత పోరు: ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం రైతాంగం సంఘటిత పోరాటం చేయాలని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయం రైతులకు ఉపయోగకరంగా మారాలంటే ప్రభుత్వ విధానాలు మారాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులతో కమిటీలు ఏర్పాటుచేసి సమస్యల పరి ష్కారానికి పోరాటానికి సన్నద్ధం కావాలన్నారు. విద్యుత్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్రం అనేక చట్టాలను తెచ్చిందని, వాటిని అడ్డుకునేందుకు పోరాడాలని అన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి వెబ్సైట్ కారణంగా రైతులకు నేటికీ పాస్పుస్తకాలందక రైతుబంధు, రైతుబీమా పథకాలకు నోచుకోవడం లేదని వివరించారు.
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు
నవతెలంగాణ -నల్లగొండ
దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించి, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కష్ణన్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరిగార్డెన్లో (మల్లుస్వరాజ్యం నగర్) మాలి పురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో మూడ్రోజులు నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిలభారత రైతు సంఘాన్ని రానున్న కాలంలో నిర్మాణాత్మకంగా మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేరళ రాష్ట్రం తిరుసూర్లో అఖిలభారత మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలంలో అవలంబించిన రైతాంగ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర మహాసభలో చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ సర్కార్ను గద్దె దించేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు సంఘాల 13 నెలల పోరాటంలో 750 మంది రైతులు ప్రాణ త్యాగం చేశారని, ఈ పోరాటం భవిష్యత్ రైతాంగ పోరాటాలకు ఆశాకిరణమని చెప్పారు.