Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వరంగంలోనే విద్యావైద్యం ఉండాలి
- జర్నలిస్టుల అధ్యయన వేదిక రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ప్రయివేటీకరణ విధానాల అమలుతో విద్యావైద్య రంగాలు కార్పొరేట్పరయ్యాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సర్కారు ఆస్పత్రులు, విద్యాసంస్థలు నిర్వీర్యమయ్యాయని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులను నియంత్రించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యావైద్యం ప్రభుత్వరంగంలోనే ఉండాలని కోరారు. గతంలో యశోద ఆస్పత్రిలో మరణించిన రమ్య ఘటన పట్ల విచారణ చేపట్టాలనీ, ప్రాణహిత, యశోద ఆస్పత్రులకు హెచ్చరిక జారీ చేయాలని అన్నారు. దీనిపై బుధవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఆయన స్పందనను బట్టి ధర్నాకు చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో 'తెలంగాణలో కార్పొరేట్ శక్తుల చేతిలో వైద్యం'అనే అంశంపై మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని వివరించారు. గ్రామాల్లో రూ.24 వేలు, పట్టణాల్లో రూ.30 వేలు వైద్యం కోసం ప్రజలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. వైద్యరంగానికి వివిధ రాష్ట్రాలు సగటున 5.3 శాతం నిధులు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం 4.4 శాతం ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారనీ, ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, ఉస్మానియా, గాంధీ వంటి ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత ఉందన్నారు. మూడు వేల డాక్టర్లు అవసరమనీ, తక్షణమే ఆయా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్ అవసరమని కోరారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రమ్య మరణం ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రోజూ పర్యవేక్షించే సీఎం కేసీఆర్‌కు ఉస్మానియా, గాంధీతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు తీసుకునే సమయం లేదా?అని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో వచ్చే కమీషన్లతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులను నియంత్రించేందుకు ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ విద్యావైద్య రంగాలు ప్రభుత్వం చేతిలో ఉండేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నదని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.వంద కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. పేదోళ్లకు ఉచితంగా విద్యావైదం అందించడమే తమ లక్ష్యమని అన్నారు.
డాక్టర్ వసంత్‌కుమార్ మాట్లాడుతూ డెంగీ వ్యాధి వస్తే ఒక్కొక్కరికీ రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే ఖర్చవుతాయని చెప్పారు. ప్లేట్లెట్లు పడిపోకుండా ఉండే మందులున్నా, వాటిని వినియోగించడం లేదని అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల లాభార్జనకు సామాన్యులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావైద్యరంగాలను ప్రజలకు అందించాలని కోరారు. ఆప్ చైర్పర్సన్ ఇందిరాశోభన్, బీఎస్పీ నాయకులు అరుణ, జర్నలిస్టులు విఠల్, జయసారథిరెడ్డి, పివి శ్రీనివాస్, సతీశ్ కమల్ మాట్లాడుతూ జర్నలిస్టు రవీందర్ మరణంపై ఈటల రాజేందర్ మౌనం వీడాలని కోరారు. రమ్య మరణంపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు రఘుపై కేసులను ఎత్తేయాలని చెప్పారు. రమ్య తండ్రి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పొలం తాకట్టు పెట్టి ప్రాణిహిత ఆస్పత్రికి రూ.లక్ష, యశోద ఆస్పత్రికి రూ.ఆరు లక్షలు కట్టానని చెప్పారు. అయినా తన కూతురు చనిపోయిందన్నారు. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలనీ, తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండీ సాధిక్, జర్నలిస్టు రఘు తదితరులు పాల్గొన్నారు.