Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ఆర్టీపీ అధినేత్రి యత్నం..
- కారులోనే బైటాయింపు.. క్రెయిన్ సహయంతో స్టేషన్‌కు తరలింపు
- టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరిస్తున్నారు : షర్మిల
- వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిలను మంగళవారం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.సోమవారం నర్సంపేటలో టీఆర్ఎస్ దాడిలో ధ్వంసమైన కారులో భారీ కాన్యారుతో ప్రగతిభవన్ ముట్టడికి ఆమె యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. డోర్ లాక్ చేసుకుని కారు లోపలే ఉండిపోయారు. దీంతో సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు.. షర్మిల ఉన్న కారును క్రేన్ సాయంతో ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచారు. అనంతరం షర్మిలను పీఎస్ లోపలికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ట్రాఫిక్ జామ్ కారణంతో షర్మిలపై కేసు...
వీఐపీ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని షర్మిలపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 353, 337 సెక్షన్లను నమోదు చేశారు. కాగా .. ప్రగతిభవన్ వద్ద ఉదయం నుంచి కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేస్తాననీ,...శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని పోలీసుల అనుమతిని షర్మిల కోరారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రగతిభవన్ ముట్టడికి వెళు ్తన్నారనే ముందస్తు సమాచారంతో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.షర్మిలను జడ్జి ముందు హాజరు పరచగా వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పాద యాత్ర ఆపేందుకు ప్రభుత్వం కుట్ర
''నా పాదయాత్రను ఆపేందుకే టీఆర్ఎస్ కుట్రలు'' చేస్తున్నదని షర్మిల ఆరోపించారు. ఆ పార్టీ కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తిస్తున్నారని షర్మిల విమర్శించారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యమే లేదన్నారు. తమపై దాడులు చేసి.. వాహనాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. అన్ని వాళ్లే చేసి.. తాము శాంతిభద్రతల సమస్య సష్టిస్తున్నామంటున్నారన్నారని తెలిపారు.