Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన గింజ కరువే
- పడిపోతున్న ఉత్పత్తి
- అంతా ప్రయివేటే...
- చేతులెత్తేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విత్తనాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవంతో అన్నదాతపై విపరీతమైన విత్తన భారం పడుతున్నది. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందడం లేదు. విత్తనం ఉత్పత్తి చేసే రైతులకు సరైన ప్రోత్సహకాలు ప్రకటించకపోవడంతో లేకపోవడంతో విత్తనోత్పత్తి నుంచి వారు వెనక్కిపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనాలు రైతులకు దొరకడం లేదు. మరోవైపు విత్తన ఉత్పత్తి పడిపోతున్నది. మేలురకం విత్తనాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. దీంతో రైతులు ఎక్కువ పైసలు పెట్టి ప్రయివేటు కంపెనీల విత్తనాలనే కొనుక్కోవాల్సి వస్తున్నది. రాష్ట్రం విత్తన భాండాగారమంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా విత్తన ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో విచ్చలవిడిగా ప్రయివేటు కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వాటిపైన్నే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపుల వేరుశనగ, హైబ్రిడ్ మక్కజొన్న, హైబ్రిడ్ వరి, కూరగాయలు, ఫాదర్ సీడ్ ప్రొడక్షన్, జొన్న, సజ్జ, రాగులు వంటి పంటలకు విత్తనాల ఉత్పత్తి లేకుండాపోయింది.
కార్పొరేట్ రక్షణ కోసమే ఇస్టా
విత్తనాల అభివృద్ధి, ఉత్పత్తిలో సీడ్ కార్పొరేషన్ విఫలం కావడంతో ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా మారింది. గతంలో ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఉత్పత్తిలో చేతులెత్తేయడంతో ఆ సంస్థ ఆదాయం పోవడంతో ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సీడ్ సర్టిఫికేషన్, సీడ్ ప్రొడక్షన్, సీరీసెర్చ్, సీడ్ క్వాలిటీపై పర్యవేక్షణ లేకుండాపోయింది. వాటికి తగిన నిధులు కూడా లేవు. కరీంనగర్లోని సీడ్ టెస్టింగ్ ల్యాబును సద్వినియోగం చేసుకోవడంలో విత్తనాభివృద్ధి సంస్థ విఫలమవుతున్నది. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) అధ్యక్షులుగా రాష్ట్రానికి చెందిన అధికారి ఎన్నికైనట్టు గొప్పలు చెప్పుకుంటున్నా అది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల రక్షణ కోసమే పని చేస్తుండడం ఆవేదన కలిగిస్తున్నది. ప్రభుత్వం వైపు నుంచి విత్తనోత్పత్తికి ఎలాంటి సహకరం లేదు. దీంతో ప్రయివేటు కంపెనీలు అక్రమ దందాలతో వేల కోట్లకు పడగలెత్తుతుండగా ప్రభుత్వ రంగ సంస్థ మాత్రం దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నది.
తగ్గిన విత్తనోత్పత్తి
ప్రస్తుతం వానాకాలంలో 75వేల ఎకరాల్లో వేయాల్సిన సర్టిఫైడ్ వరిసీడ్ గణనీయంగా మూడో వంతుకు పడిపోయింది. గత సీజన్లో కేవలం 25వేల ఎకరాల్లోనే సర్టిఫైడ్ సీడ్ సాగైంది. ఇక పప్పు దినుసుల్లో పెసర్లు, కందులు, పప్పు శనగ సీడ్ ప్రొడక్షన్ కూడా భారీగా తగ్గిపోయింది. ఇక రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా విత్తన ఉత్పత్తిదారులు పక్క రాష్ట్రాలైన చత్తీస్గఢ్, కర్నాటకకు తరలిపోతున్నారు. గతంలో దేశంలోని రాష్ట్రాల ఇంటర్నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ ప్రక్రియ తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ ఆథారిటీ పరిధిలో ఉండేవి. అయితే, పరిపాలన వైఫల్యం వల్ల ఇప్పటికే ఆయా రాష్ట్రాలు మన నుంచి వైదొలిగాయి. ఇప్పుడు మన రాష్ట్రంతోపాటు చత్తీస్గఢ్ మాత్రమే ఆ అధికారంలో కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రచార్భాటం తప్పితే ఇది రైతులకు ఉపయోగం లేని సంస్థగా మారింది. సీడ్ విత్తనాలపై పారదర్శకంగా ఉండేందుకు పొందుపరచాల్సిన క్యూఆర్ కోడింగ్, సీడ్ సర్టిఫికేషన్, సీడ్ తనిఖీ యాక్టివిటీ వంటివి చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
నిస్తేజంలో ' సీడ్ కార్పొరేషన్'
ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు వేయాలనుకున్న రైతులకు సీడ్ కార్పొరేషన్ విత్తనాలు అందించే స్థితిలో మాత్రం లేదనే విమర్శలు ఎదుర్కొంది. అలాగే రాష్ట్రంలో ఏటా సీడ్ ప్రొడక్షన్ గణనీయంగా పడిపోతున్నది. మూడు కిలోలు ఉండే ఆర్ఎక్స్ 100 బ్యాగుకు రూ.900 ధర పలుకున్నది. వ్యాపారులు ఒక్కో దగ్గర ఒక్కోలా రూ. 1800 నుంచి రూ.3.600 వరకు కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఎకరానికి 6 నుంచి 9 కిలోల సీడ్స్ అవసరం కావడంతో విత్తనాలకే రైతులు భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. దీంతో ప్రతీ సీజన్లోనూ విత్తనాలు సమయానికి అందక సీడ్ సర్టిఫికేషన్ లేని ప్రయివేటు కంపెనీలను రైతులు ఆశ్రయించాల్సిన దుస్థితి కొనసాగుతున్నది.
కార్పొరేట్ గుప్పిట్లో విత్తన రంగం
టి సాగర్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
విత్తనరంగం మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం విత్తన రైతులను ప్రోత్సహించడం లేదు. స్థానికంగా మేలు రకాలు ఉత్పత్తి చేసి రైతులకు అందించాలి. విత్తన పరిశోధనలకు నిధులు కేటాయించకుండా ఆయా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ఇదే ఇప్పుడు రైతులకు ఇబ్బందికరంగా కార్పొరేట్లకు వరంగా మారింది. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండాలి.