Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ నాటికి 90శాతం పనులు
- రూ.985 కోట్లతో 56 నాలా పనులు
- పికెట్ నాలాపై బ్రిడ్జి, బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు బాక్స్డ్రెయిన్
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలను భారీ వర్షాలు, వరద ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2020లో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ కురవని వర్షాలు ఆ ఏడాది కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) ద్వారా నాలా అభివృద్ధి పనులు, బాక్స్ డ్రెయినేజీ పనులు, చెరువులకు సంబంధించిన లింకులు వంటి పనులు చేపట్టారు. ప్రజల ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు నిధులు సమకూర్చి జీహెచ్ఎంసీ పనులను ప్రారంభించిన నేపథ్యంలో ఒక్కొక్క పని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి రానున్న వర్ష కాలంలో లోతట్టు ప్రాంత ప్రజలకు వరద ముప్పు బెడద లేకుండా మెరుగైన వసతులు కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90శాతం పనులు, వచ్చే ఏడాది మార్చి నాటికి 100శాతం పనులను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫలితంగానే ఒక్కో పనిని అధికారులు పూర్తిచేసుకుంటూ వస్తున్నారు.
రూ.985కోట్లతో ..
ఎస్ఎన్డీపీ ద్వారా రూ.985 కోట్లతో 60 పనులు ప్రతిపాదించగా అందులో 37 పనులు జీహెచ్ఎంసీ పరిధిలోకాగా మిగతా 23 పనులు జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న మున్సిపాల్టీల్లో ప్రతిపాదించారు. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.737.45కోట్లతో 35 పనులు చేపట్టారు. ఇతర మునిసిపాల్టీల్లో రూ.248 కోట్లతో 21 పనులు, మొత్తం 56 పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన పనుల్లో రూ.7.26 కోట్లతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం పూర్తితో ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన రెండో పని పూర్తయింది. ఇంతకు ముందు సనత్నగర్ నియోజకవర్గం బేగంపేట సర్కిల్ పికేట్ నాలాపై రూ.10 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులతో అక్టోబర్ నెలలో అందుబాటులోకి వచ్చి మొట్టమొదటి ప్రాజెక్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు చేపట్టిన పనిపూర్తి కావడంతో అనేక కాలనీలకు వరద ముంపు సమస్య తీరనున్నది. జీహెచ్ఎంసీ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది.
90శాతం పనులు
డిసెంబర్ నాటికి 90 శాతం పనులు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన 35 పనులల్లో ఇప్పటి వరకు రెండు పనులు పూర్తికాగా, డిసెంబర్ చివరి వరకు సుమారు 32 పనులు పూర్తి చేసి మిగిలిన పనులన్నింటినీ మార్చి చివరి వరకు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇతర మునిసిపాల్టీల్లో రూ.248 కోట్లతో చేపట్టిన 21 పనుల్లో ఒక పని పూర్తయింది. మరో 16 పనులు డిసెంబర్ వరకు, 4 పనులు వచ్చే సంవత్సరం మార్చి వరకు పూర్తి చేయనున్నారు.