Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతం
- ఈ నెల 5న అఖిల భారత అమరవీరుల జ్యోతి యాత్ర
- ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన
- ధరణి సమస్యలపై వినతిపత్రాలు
- ఏప్రిల్ 5న ఢిల్లీలో మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ : కార్యాచరణ ప్రకటించిన రైతు నేతలు సారంపల్లి, సాగర్
నవెతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ చెప్పారు. నల్లగొండలో మూడు రోజలపాటు నిర్వహించిన రైతు సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతమయ్యాయని వారు తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల్లో చేసిన తీర్మానాలను, కార్యచరణను రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్తో కలిసి సారంపల్లి, సాగర్ మీడియాకు వెల్లడించారు. రైతుసమస్యలపై చర్చించిన మహాసభ భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించిందని చెప్పారు. వివిధ సమస్యలపై 29 తీర్మానాలను ఆమోదించిందని తెలిపారు. 87 మందితో నూతన కార్యవర్గాన్ని, 29 మందితో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ను, ఇద్దరు శాశ్వత ఆహ్వానితులుగా ఎన్నుకుందని చెప్పారు.
ఉద్యమ కార్యాచరణ ఇలా...: అఖిల భారత అమర వీరుల జ్యోతి యాత్ర
ఏఐకెేఎస్ 35వ అఖిల భారత మహాసభల సందర్భంగా అమర వీరుల జ్యోతియాత్ర డిసెంబర్ 5న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్వగ్రామం కడవెండి (జనగామ జిల్లా) నుంచి ప్రారంభమవుతుంది. మోత్కూరు (భువనగిరి), గుండ్రాంపల్లి (నల్గొండ)తోపాటు నల్గొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో సభలను నిర్వహిస్తాం. ఈ యాత్ర కేరళ రాష్ట్రంలోని త్రిసూల్ వరకు కొనసాగుతుంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన
రాష్ట్రంలో మద్దతు ధరలకే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించినప్పటికీ అనేక కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాల సందర్శించాలని మహాసభ నిర్ణయించింది.
ధరణి సమస్యల పరిష్కారం కోసం...
ధరణి సమస్యల వల్ల అనేక గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాటి పరిష్కారానికి విస్తతంగా గ్రామాల్లో పర్యటించడం సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.
రైతు-సిఐటియు-వ్యవసాయ కార్మిక సంఘం సంఘర్స్ ర్యాలీ
మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ ఏప్రిల్ 5న ఢిల్లీలో ఉంటుంది. ఆలోపు రాష్ట్ర, జిల్లా, మండల సదస్సులు జరపాలి. విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి.