Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదవాడి సొంతింటి కలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కలిసి చిధ్రం చేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరాశోభన్ విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఇందుకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని గణాంకాలతో సహా వివరించారు. కేంద్రం పంపించిన నిధులతో ఎందుకు పేదవాడికి ఇల్లు కట్టించలేదు? లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయలేదు? కేంద్రం ఇచ్చిన నిధులను ఏ ఏ రంగాలకు మళ్ళించారు? ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎందుకు నిలదీయలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 2014 నుంచి 2022 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,09,543 మంది లబ్దిదారులను గుర్తించినట్టు రాష్ట్ర జాబితా పంపించిందని తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.1,311.50 కోట్లు వచ్చాయని చెప్పారు.
అయితే 2014 నుంచి 2021 వరకు 1,08,537 డబుల్ బెడ్ రూం ఇండ్లను మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. లబ్దిదారులకు మొత్తం 13,723 ఇండ్లను మంజూరు చేశారని వివరించారు. 2018లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే, ఇంటి స్థలం ఉన్నవారికి రూ.ఐదు లక్షలు ఇస్తామంటూ హామీ ఇచ్చిందని ఇందిరాశోభన్ గుర్తుచేశారు. ఆ డబ్బులు ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనీ, ఇండ్లు నిర్మించి ఇవ్వాలనీ, సొంత స్థలం ఉన్న వారికి రూ.ఐదు లక్షలివ్వాలని ఆమె డిమాండ్ చేశారు.