Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారం కోసం వ్యవస్థల దుర్వినియోగం తగదు
- చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేయాలి
- కేంద్రానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డదారులు తొక్కడం తగదని బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో పరిపాలనను అస్థిర పరచడంతోపాటు ప్రభుత్వాన్ని కూలదోసేలా రాజ్యాంగ వ్యవస్థలైన ఐటీ, ఈసీ, ఈడీ, సీబీఐ, గవర్నర్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక, రాజకీయ, అనైతిక చర్యలతో ముప్పేట దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దేశం అప్పు రూ.55 లక్షల కోట్లుంటే, ఇప్పుడు రూ.155 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో రూ.100 కోట్ల అప్పులు చేసిన ఘనులు తెలంగాణ నిధులు అడ్డుకుంటారా?అంటూ అడిగారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలను చేయాలని కోరారు. కేంద్ర దుర్నీతిని రాష్ట్ర ప్రజలు అంగీకరించబోరని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన రూ.50 వేల కోట్ల వరకు నిధుల విడుదలకు మోకాలడ్డుతున్నదని విమర్శించారు. పాదయాత్ర పేరుతో బండి సంజరు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కేంద్రం దుర్నీతి, కుట్రలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలకు సంసిద్ధమవుతుందని హెచ్చరించారు.