Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది..
- ఎమ్మెల్యేల ఎర కేసులపై హైకోర్టులో ప్రభుత్వం వాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందనీ, అందువల్ల సీబీఐ దర్యాప్తు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టులో వాదించారు. దేశంలో సీబీఐ చేపట్టిన ఎన్నో కేసుల దర్యాప్తు వీగిపోతున్నాయని తెలిపారు., సీబీఐ కంటే సిట్ అద్భుతంగా దర్యాప్తు స్థాయిలోనే చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీతో పాటు నిందితులు, సాక్షులు దాఖలు చేసిన పలు రిట్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి ఏకసభ్య ధర్మాసనం ఎదుట బుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్ర నేరమని దవే వాదించారు. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే అవకాశం లేని విధంగా దర్యాప్తు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నదనే దానికి, అభియోగాలకు ఆధారాల్లేవన్నారు. మోయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న వీడియోలు, ఆడియోలు సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపడం పొరపాటేనని చెప్పారు. ఉనికి దెబ్బతినే పరిస్థితి తలెత్తినపుడు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టలకు మసకబారే నేపథ్యంలో, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిన సందర్భంలో, పార్టీ అధినేతగా సీఎం వాటిని మీడియాకు ఇస్తే తప్పు లేదన్నారు. బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ప్రజలకు విషయాలను వివరించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందనీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని తెలిపారు. ఈ వాదనను బీజేపీ పిటిషనర్‌తో పాటు ముగ్గురు నిందితుల పిటిషనర్ల తరపు లాయర్లు వ్యతిరేకించారు. బీజేపీకి, ముగ్గురు నిందితులకు సంబంధం లేదని ఒకరు, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం రాజకీయంగా సిట్ దర్యాప్తు చేయిస్తోందని మరొకరు వాదించారు. ఇదే కేసులో 41ఎ నోటీసు అందుకున్న తుషార్‌ను అరెస్టు చేయరాదంటూ హైకోర్టు ఆదేశించింది. అన్ని కేసుల విచారణను 6కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయని పేర్కొంటూ దాఖలైన మరో రిట్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో బెయిల్ ఇవ్వాలని ముగ్గురు నిందితులు విడిగా వేసిన కేసులో కౌంటర్ వేయాలని సిట్‌ను హైకోర్టు జడ్జి సుమలత ఆదేశించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు.