Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కవితకు మహేష్‌కుమార్ సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఆ తర్వాత మీ ఆస్తులెన్నో చెప్పాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. దీనిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేత మెట్టు సాయికుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహులు అని చెప్పడమంటే చరిత్రను వక్రీకరించడమేనన్నారు. సోనియాగాంధీ దయవల్లే తెలంగాణ సిద్ధించిందంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని కవిత మర్చిపోయారని విమర్శించారు. కవిత పుట్టక ముందే ఇందిరాగాంధీ బతుకమ్మ ఆడారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 80శాతం మంది ప్రస్తుత మంత్రులు ఆనాడు ఉద్యమకారులపై రాళ్లు వేసిన వారేనని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు బతుకులు మారలేదనీ, కల్వకంట్ల కుటుంబ సభ్యుల బతుకులు మారాయని ఆయన ఎద్దేవా చేశారు.