Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ- ముషీరాబాద్
జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్, ఆగ్రో ఇండిస్టీస్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఉత్పత్తి కంపెనీని రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆ కంపెనీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. పిడికెడు మంది బడాబాబులు వాడే కార్ల ఇంధనం కోసం విత్తనాలు ఉత్పత్తి అంటూ మొత్తం ప్రజల జీవనాన్ని విధ్వంసం చేస్తున్నారని, దీనిని విరమించుకోవాలన్నారు. పోరాడి సాధించుకున్న కోయిల్‌సాగర్ నీటిని రైతులకు దక్కకుండా తరలించకపోయే అవకాశం ఉందన్నారు. ఈ కంపెనీలో ఇథనాల్ ఉత్పత్తి క్రమంలో విడుదలయ్యే కాలుష్యం, వ్యర్థాలు 32 గ్రామాలకే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణానదికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కార్పొరేట్లకు, డ్రగ్ కంపెనీలకు అనుకూలంగా ఉంటున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో పర్యావరణ రక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్ట్ కె.బాబురావు, ప్రొఫెసర్లు కె.చక్రధర్ రావు, కె.లక్ష్మీనారాయణ, గడ్డం లక్ష్మణ్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.వెంకటరాములు, కుల అసమానత నిర్మూలన పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.చక్రవర్తి, చిత్తనూరు యువత మండలి నాయకులు మురళి, కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు డిజచంద్రశేఖర్, టీఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం డి.ఖలీల్, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ నగేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.