Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
ఇల్లు లేని పేదలకు ప్రభుత్వమే నేరుగా ఇంటి స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కోరారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐదో రోజు రిలే దీక్ష కొనసాగిస్తున్న గుడిసెవాసులకు బుధవారం ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటి స్థలాల కోసం పోరాడుతున్న పేదల డిమాండ్ న్యాయమైందని, ప్రభుత్వమే పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి.. ప్రతి నిర్మాణానికీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల పట్టాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు న్యాయం జరగకపోవడంతో అబ్దుల్లాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెం.283లో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు పేదల గుడిసెలను కూల్చివేయడం బాధాకరమని, గుడిసెలు కూల్చి వేసినంత మాత్రాన భూ పోరాటం ఆగిపోదని చెప్పారు. ఇంటి స్థలాలు దక్కే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జి. శివకుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.