Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో ర్యాలీ, సభ
- రాష్ట్రంలో 1.55 లక్షల మందికి హెచ్‌ఐవీ
- సొసైటీ వద్ద నమోదు చేసుకోని వారి సంఖ్య 65 వేలు: టిసాక్స్ ఏపీడీ డాక్టర్ అన్నప్రసన్నకుమారి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ కళ్యాణమండపం వరకు ర్యాలీ, అనంతరం సభను నిర్వహించనున్నట్టు ఆ సొసైటీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ అన్నప్రసన్నకుమారి తెలిపారు. బుధవారం హైదరాబాద్ కోఠిలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గురువారం నిర్వహించబోయే కార్యక్రమాల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పాటు శాక్స్‌తో కలిసి పని చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వారు పాల్గొంటారని తెలిపారు. వ్యాధి ప్రబలత ఆధారంగా రాష్ట్రంలో 1.55 లక్షల మంది హెచ్‌ఐవి సోకిన వారున్నారని తెలిపారు. అయితే సొసైటీ వద్ద కేవలం 90 వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారనీ, మిగిలిన 65 వేల మందిని గుర్తించడమే వచ్చే ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇక నుంచి ప్రజల వద్దకే స్క్రీనింగ్ ప్రక్రియను తీసుకెళ్లనున్నామని చెప్పారు. ప్రయివేటు కాలేజీల విద్యార్థుల్లోనూ అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. వ్యాది ప్రబలత 2020లో 0.48 శాతం ఉండగా 2021లో 0.47శాతానికి తగ్గిందని తెలిపారు. 6,84,303 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించామనీ, 558 మంది హెచ్‌ఐవీ ఉన్న తల్లులు జన్మనివ్వగా ఏడుగురు చిన్నారులు ఆ వైరస్‌తో జన్మించారని చెప్పారు. రాబోయే నాలుగైదు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో లింగమార్పిడి శస్త్రచికిత్సల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 2030 నాటికి రాష్ట్రంలో కొత్త కేసులు రాకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.