Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
డా.బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పురోగతి పనులను బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు మూడున్నర గంటల పాటు కలియతిరిగారు. ప్రణాళికా ప్రకారం అంతస్థులవారీగా పనులను పురోగతి పరిశీలించారు. అనంతరం అక్కడే ఆర్ అండ్ బీ అధికారులతో, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోపు అన్ని రకాల నిర్మాణ ఫినిషింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. మెెయిన్ గ్రాండ్ ఎంట్రీ, ఫౌంటెన్ నిర్మాణం, డొమ్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, బ్లాకులవారీగా జరుగుతున్న పలు ఫినిషింగ్ పనులపై అధికారులతో కూలంకషంగా, సుదీర్ఘంగా చర్చించారు. అన్ని రకాల పనులు సమాంతరంగా మూడు షిఫ్టుల్లో జరగాలనీ, అవసరమైతే వర్కర్లను పెంచుకోవాలని సూచించారు. కేసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కట్టడం నిర్మిస్తున్నదనీ, చారిత్రాత్మక ఈ ప్రభుత్వ పరిపాలన భవన నిర్మాణానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు. అందుకోసమే అధికారులు, వర్క్స్ ఏజన్సీ ప్రతినిధులు మనసుపెట్టి ఫినిషింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్బంగా కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోగా తప్పనిసరి అన్ని రకాల పనులు పూర్తికావాలని మంత్రి అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్.ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈ.ఈ శశిధర్, పలువురు ఆర్ అండ్ బీ అధికారులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.