Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులమతాల మధ్య చిచ్చు పెడుతూ ఏలుతున్నది బీజేపీ ప్రభుత్వం
- మహారాష్ట్ర సర్పంచ్‌లు తెలంగాణలో కలుస్తమంటున్రు
- నూతన మండలం అక్బర్‌పేట-భూంపల్లి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-దుబ్బాక దుబ్బాక రూరల్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన నీటితో వేసవికాలం మొదలు నేటి వరకు నిరంతరాయంగా చెక్ డ్యాములు దుంకుతున్నాయని, కూడెల్లి వాగులో ప్రవహిస్తున్న నీరు ఇక్కడి బీజేపీ నాయకులకు కనిపించడం లేదా.. కాళేశ్వరం నీళ్లు కనబడటం లేదన్నోళ్లను ఇదే కూడెల్లిల తోయాలి అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. కూడవెల్లి జలకళతో ఇక్కడి బోర్లల్లో పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలేనని తేల్చి చెప్పారు. అక్బర్‌పేట-భూంపల్లి నూతన మండల ఏర్పాటుకు కృషి చేసింది మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అని, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లాలో నూతనంగా అక్బర్ పేట-భూంపల్లి మండలం ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు చిట్టాపూర్ గ్రామం మోతే కమాన్ నుంచి భూంపల్లి బ్రిడ్జి వరకు బైక్ మీద మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్రలోని ధర్మబాద్, బిలోలి తాలూకాలకు చెందిన 25 మంది సర్పంచులు వారి గ్రామాలను తెలంగాణలో కలపమంటున్నారని వెల్లడించారు.
వ్యవసాయ బోరు మోటార్లకు మీటర్లు పెట్టనందుకే కేంద్రం నుంచి తెలంగాణకు వాటాగా రావాల్సిన రూ.12 వేల కోట్లను మోడీ సర్కార్ నిలిపివేసిందని ఆరోపించారు. రూ.12 వేల కోట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2009 నవంబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి కేంద్రంలో ప్రకంపనలు పుట్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. దీనికి ప్రతీకగా ప్రతి ఏటా నవంబర్ 29న దీక్ష దివస్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు చూపించిన పోరాటపటిమ, తెగువను వచ్చే ఎన్నికల్లో చూపించి దుబ్బాక గడ్డపై గులాబీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతరం నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీఓ అనంతరెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అక్బర్ పేట-భూంపల్లి నూతన మండల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.వీరేష్‌ను మంత్రి, ఎంపీ శాలువా కప్పి సన్మానించారు. జెడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, దుబ్బాక జెడ్పీటీసీ కడ్తాల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కైలాష్ పాల్గొన్నారు.