Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరస్పర విమర్శలు.. ట్వీట్లు
- హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిన్నటిదాకా బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్.. అంటూ సాగిన రాష్ట్ర రాజకీయాలు, ఇప్పుడు ఒక్కసారిగా వైటీపీ (వైఎస్సార్ టీపీ) వర్సెస్ టీఆర్‌ఎస్‌లాగా మారిపోయాయి. ఈ పొలిటికల్ వార్‌లో వైటీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కూతురు షర్మిల ప్రాతినిధ్యం వహిస్తుండగా... టీఆర్‌ఎస్ తరపున సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత సై అంటే సై అంటూ కత్తులు దూస్తున్నారు. వీరిద్దరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ట్వీట్లు, రీ ట్వీట్ల యుద్ధం కొనసాగుతున్నది. అటు వైటీపీ నుంచి ఆ పార్టీ నేతలు షర్మిలకు మద్దతుగా ప్రెస్‌మీట్లు పెడుతుండగా... ఇటు కవితకు సపోర్టుగా ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యర్థుల వ్యాఖ్యలను ఖండ ఖండాలుగా ఖండిస్తున్నారు. జనగామ జిల్లా నర్సంపేటలో షర్మిలపై దాడి, ఆ తర్వాత ఆమెను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించటం, అటుపైన ఇక్కడి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామంటూ ఆమె ప్రకటించటం, ఇక్కడ కూడా షర్మిల కారుపై దాడులు, అరెస్టులు, నిరసనలు తదితర ఘటనలన్నీ తెలిసినవే. ఈ క్రమంలోనే షర్మిల... 'తెలంగాణలో గుండాల రాజ్యం నడుస్తోంది.. బీఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి...' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ కవిత... షర్మిలనుద్దేశించి అదే స్థాయిలో వ్యగ్యంగా ట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. షర్మిల బీజేపీ కోవర్టు అంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. 'నేను నీ మాదిరిగా పొలిటికల్ టూరిస్టును కాదు.. ఉద్యమ బిడ్డను...ఉద్యమంలో పుట్టిన మట్టి కవితను' అంటూ చురుకలంటించారు. 'అమ్మా... కమల బాణం... ఇది మా తెలంగాణం.. పాలేవో, నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజాగణం...' అంటూ దెప్పిపొడిచారు. మరోవైపు షర్మిల తరపున ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు విలేకర్ల సమావేశం నిర్వహించి టీఆర్‌ఎస్‌పై మాటల దాడి చేయగా...కవితకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నోముల భగత్, గొంగిడి సునీత, ఎంపీ మాలోత్ కవిత ప్రతి దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు మహిళా నేతల రాజకీయ యుద్ధం ఎక్కడికి చేరుకుంటుందో వేచి చూడాలి.