Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జటిలంగా నారాయణపూర్ రిజర్వాయర్ గండి సమస్య
- సాగునీరు కావాలంటున్న రైతులు
- పరిహారం తేల్చాకే మరమ్మతులు చేపట్టాలని ముంపు గ్రామాల హెచ్చరికలు
- 'కాళేశ్వరం' నీళ్లు రావాలంలే ఈ రిజర్వాయరే దిక్కు!
- గండి పూడ్చకపోతే 1.65లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం
- ఆందోళనలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల రైతాంగం
- సమస్య పరిష్కరించకపోతే ఎండాకాలం తాగునీటికి ఇక్కట్లే.. !
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
నారాయణపూర్ రిజర్వాయర్ సమస్య జఠిలంగా మారింది. మొన్నటి భారీ వర్షాలకు రిజర్వాయర్‌కు గండి పడి చుక్కనీరు లేకుండా పోయింది. యాసంగికి సాగు నీరందించేందుకు గండి పూడ్చాలని ఆయకట్టు రైతులు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు పరిహారం విషయం తేల్చేవరకు మరమ్మతులు చేపట్టొద్దని ముంపు గ్రామాల ప్రజలు భీష్మించుకూర్చున్నారు. కాళేశ్వరం నీళ్లు రావాలంటే ఈ రిజర్వాయరే దిక్కు. గండి పూడ్చకపోతే 1.65 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం కానుంది. తాగునీటికీ ఇక్కట్లు ఏర్పడనున్నాయి.
కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని సుమారు 1.65లక్షల ఎకరాల సాగుకు చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయరే దిక్కు!. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ రిజర్వాయర్‌కు పంపింగ్ చేసి యాంసంగికి నీళ్లందిస్తున్నారు. గతంలోనే రిజర్వాయర్ కట్టను 1.4మీటర్ల ఎత్తుకు పెంచి 0.3టీఎంసీల అదనపు నీటిని నిల్వ చేసేందుకు సర్కారు రూ.24.10కోట్లు మంజూరు చేసింది. అయితే, కట్ట పెరగడంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పరిహారం అందించలేదు. సరికదా.. ఈ రిజర్వాయర్‌కు మొన్నటి భారీ వర్షాలకు గండి పడి సుమారు ఐదారు ఊర్లు నీటమునిగాయి. కట్టుబట్టలతో జనం పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గండి వల్ల ప్రస్తుతం రిజర్వాయర్‌లో చుక్కనీరు లేదు. ఇప్పుడు యాసంగికి నీళ్లందించేందుకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు ఆందోళన చేస్తుంటే.. తమ పరిహారం సంగతి తేల్చాకే గండి పూడ్చాలని ముంపు గ్రామాలు భీష్మించాయి. ఈ క్రమంలో నారాయాణపూర్ రిజర్వాయర్ పరిస్థితిపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం.
11 ఏండ్ల కిందట ఎల్లంపల్లి ఫేస్ 1, ఫేస్ 2 కింద రిజర్వాయర్ కోసం భూసేకరణ చేశారు. అప్పట్లోనే ముంపు ఇండ్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏండ్లు గడుస్తున్నా.. ఆ హామీ గురించి మాట్లాడకుండా రిజర్వాయర్‌ను పూర్తి చేశారు. దీంతో ప్రతి వర్షాకాలంలో రిజర్వాయర్‌కు వస్తున్న భారీ వరదతో సమీప గ్రామాల్లోకి నీళ్లు వస్తున్నాయి. మొన్నటి వానాకాలం భారీ వర్షాలకు నారాయణపూర్ రిజర్వాయర్ సహా దాని కింద ఉన్న గంగాధర చెరువుకూ గండి పడింది. దీంతో దాని సమీపంలోని ఐదు ఊర్లు నీట మునిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కట్టుబట్టలతో ఆయా గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ముఖ్యంగా నారాయణపూర్, మంగపేట, చర్లపల్లి ఎన్ గ్రామాల్లో కొందరు ఇప్పటికీ ఊర్లు విడిచి పక్క గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపూర్, చర్లపల్లి(ఎన్), మంగపేట గ్రామాల్లో 240 ఎకరాలు, నారాయణపూర్‌లో 25 ఇండ్లు, మంగపేటలో 11 ఇండ్లు, చర్లపల్లిలో కొన్ని ఇండ్లు ముంపునకు గురవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఇండ్ల యజమానులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. మంగపేటలో 87.16 ఎకరాల సాగుభూమి, 40 వ్యవసాయ బావులు, 11 ఇండ్లకు నాలుగేండ్ల కిందట అవార్డు ఎంక్వైరీ చేసి నిర్వాసితులు సంతకాలు చేసినా ఇంతవరకు పరిహారం అందలేదు. దీంతో ఇప్పుడు రిజర్వాయర్‌కు మరమ్మతులు చేస్తే మళ్లీ ముంపు సమస్య వస్తుందని, తమకు రావాల్సిన రూ.16.50కోట్ల పరిహారం అందించాకే పూడ్చాలని నిర్వాసితులు భీష్మించారు. గతంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కూడా ఆందోళన చేశారు.
ప్రశ్నార్థకంగా 1.65లక్షల ఎకరాలు
మూడు జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు 1.65లక్షల ఎకరాలకు గంగాధర, నారాయణపూర్ జలాశయాల నుంచి ఎల్లంపల్లి ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇప్పుడు సకాలంలో ఈ చెరువుల మరమ్మతులు చేసి నీరందించకపోతే సగం విస్తీర్ణంలో కూడా పంట సాగు చేసే పరిస్థితి లేదు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచే చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని దాదాపు 60 చెరువులు, కుంటలను ప్రతి యాసంగి సీజన్లో నింపుతున్నారు. ఆయా చెరువులు నిండితేనే ఎండాకాలంలోనూ భూగర్భజలాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం వానాకాలం పంట కోతలు పూర్తయ్యాయి. యాసంగి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ వరకు సాగు నీరందించాల్సి ఉంటుంది. ఇంతవరకు ముంపు సమస్య తేల్చకుండా.. రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయకుండా సమస్యను ప్రభుత్వం జఠిలంగా మారుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వచ్చే ఎండాకాలంలో గ్రామాలకు తాగునీటికీ ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు.
శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌కు మేడిపల్లి వినతి
నారాయణపూర్, గంగాధర జలాశయాల గండ్లను పూడ్చి చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి యాసంగి పంటకు నీరు అందించాలని కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం గురువారం కరీంనగర్ కలెక్టర్ ఆర్వీకర్ణన్‌ను కలిశారు. నారాయణపూర్, మంగపేట, చర్లపల్లి, ఇస్తారుపల్లి గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏండ్లు గడుస్తున్నా.. పరిహారం తేల్చకుండా.. ముంపు బాధితులను బాధిస్తున్నారని, ఇప్పుడు గండి పడిన రిజర్వాయర్లకు మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.