Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
పేదలందరూ ఎర్ర కండువాలు, ఎర్ర చీరలు, ధరించి సీపీఐ(ఎం) జెండా ఎగరవేయడం ఆనందంగా ఉందని, పార్టీ జెండా.. ఎజెండా పేదల పక్షాన పోరాడటమేనని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య స్పష్టంచేశారు. వరంగల్ జిల్లా మామునూరులోని రంగసాయి పేట సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్యతో కలిసి నాగయ్య పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మామునూరు గడ్డమీద ఎర్రజెండా ఎగుర వేయడానికి వేలాదిమంది పేదలు కలిసికట్టుగా రావడం అభినందనీయమన్నారు. పేదల న్యాయమైన హక్కుల సాధన కోసం ఎర్రజెండా చేత పట్టుకొని సీపీఐ(ఎం)లో చేరడం శుభపరిణామమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల కారణంగా పేదలు విలవిలలాడుతున్నారన్నారు. కొన్ని సంస్థలు దేశమంతా నిర్వహించిన సర్వేలో ఆకలి పెరుగుదలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంటే భారతదేశం అద్వాన పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు రక్తహీనతతో బలహీనంగా పుడుతూ చిన్న వయసులోనే ప్రాణాలు వదులుతున్నారని, ప్రభుత్వాల కారణంగా ఆకలి చావులు అధికమయ్యయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40,000 మంది పేద ప్రజలు ఇల్లు లేక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని, వారందరికీ 120 గజాల స్థలం ఇచ్చి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జక్కలొద్దీలో 296 ఎకరాల సీలింగ్ భూమిలో 50 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారని, మిగతా 250 ఎకరాల సీలింగ్ భూమి ఎవరి చేతుల్లో ఉందో కలెక్టర్, ఆర్డీవో, స్థానిక తహసీల్దార్లు ఎందుకు గుర్తించలేకబోతున్నారని ప్రశ్నించారు. పెద్దలు కబ్జా చేసిన భూములను వదిలి పేదలు వేసుకొన్న గుడిసెల జోలికి రావడం, వారిని బెదిరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు గడిచిపోతున్నా సీఎం కేసీఆర్ ఏ ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చలేదని విమర్శించారు. దాంతో పేదలు ఎదురుచూపులు చూడలేక సీపీఐ(ఎం) అండతో భూ పోరాటాలు చేస్తూ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి పేదలకు న్యాయం చేయాలని అన్నారు. రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ మాట్లాడుతూ సీపీఐ(ఎం) భూ పోరాటాల్లో పేద ప్రజల భాగస్వామ్యం ఎంతో గొప్పదని పార్టీ పేదల పక్షాన పోరాడటాన్ని చూసి మామునూరులోని ప్రజలు పెద్ద ఎత్తున చేరడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. కార్యక్రమంలో రంగశాపేట ఏరియా కమిటీ సభ్యులు మాలోతు ప్రత్యూష, రత్నం, గణపక ఒదేలు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, ప్రజానాట్యమండలి అధ్యక్ష కార్యదర్శులు దుర్గయ్య, అనిల్, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.