Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిక్కర్ స్కాంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- బీఆర్ఎస్.. బీజేపీని గడగడలాడిస్తోందంటూ వ్యాఖ్య
- జైలుకైనా రెడీ
- ప్రజాసేవను విరమించుకోను
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఆర్ఎస్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన బీజేపీని గడగడలాడించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రకటనను జీర్ణించుకోలేని ఆ పార్టీ... చౌకబారు రాజకీయాలకు తెరదీసిందని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగం చేసి.. ప్రజల ముందు ఉంచినందుకే తమపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసం వద్ద కవిత విలేకర్లతో మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏ రాష్ట్రంలోనైనా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా... మోడీ రావటానికి ముందు అక్కడికి ఈడీ పోవడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ఇదేమీ కొత్త విషయం కాదనీ, గత కొన్నేండ్లుగా దేశ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తూనే ఉన్నారని అన్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి మోడీ కన్నా ముందు ఈడీ వచ్చిందంటూ సెటైర్లు విసిరారు. 'నా మీద కావచ్చు, మన మంత్రులు, ఎమ్మెల్యే మీద కావచ్చు ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం అనేది బీజేపీ హీన, నీచమైన రాజకీయ ఎత్తుగడ తప్ప... ఇందులో ఏమీ లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయోమయానికి గురికావాల్సిన అవసరం అంతకన్నా లేదు...' అని కార్యకర్తలు, నాయకులనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.
ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమేనని కవిత ఈ సందర్భంగా ప్రకటించారు. కేంద్ర సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా సమాధానాలు చెబుతామని స్పష్టం చేశారు. కానీ మీడియాలో లీకులు ఇచ్చి నాయకులకున్న మంచిపేరును చెడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తే మాత్రం అలాంటి చౌకాబారు ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. తన రాజకీయ పంథాను మార్చుకోవాలంటూ ప్రధాని మోడీకి ఆమె ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు ఏం చేస్తామో చెప్పుకొని గెలవాలిగానీ... ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే కుదరబోదని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అది అస్సలు సాధ్యపడదని తేల్చిచెప్పారు. 'కాదూ, కూడదు... అది చేస్తాం.. ఇది చేస్తామంటే... జైలులో పెడ తామంటే పెట్టుకోండి.. ఏమైతది? భయపడేదేముంది..? ఏం చేస్తారు ? ఎక్కు వలో ఎక్కువ ఏం చేస్తారు ... ఉరి ఎక్కిస్తరా ? ఎక్కువలో ఎక్కువ అయితే జైలులో పెడతారు అంతే కదా.. పెట్టుకోండి...' అని ఆమె బీజేపీకి సవాల్ విసిరా రు. ప్రజల అండదండలున్నంత కాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాబోదని వ్యాఖ్యాని ంచారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు సేవ చేయడాన్ని విరమించబో మనీ, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడాన్ని ఆపబోమని కవిత స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామనీ, భయపడబోమని ప్రకటించారు.