Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ సంఘ సేవకులు సర్థార్ పుటం పురుషోత్తమరావు పటేల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ మిషన్ (హెచ్ఆర్పీఎం-మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ) జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.ఈ మేరకు గురువారం ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు ప్రకాష్ చెన్నితల ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషోత్తమరావు పటేల్ విద్యార్థి,యువజన ఉద్యమాలలో కీలక భూమిక పోషించారనీ,పలు సందర్భాల్లో పేదల పక్షాన నిలిచి పోరాటాలు చేశారనీ, నిస్వార్థ సంఘ సేవకులుగా పేరొందారని ప్రకాష్ పేర్కొన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో కీలకంగా పని చేశారనీ, మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తూ పొదుపు సంఘాల స్థాపనకు పాటుపడ్డారని వివరించారు. మూలవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు,మానవ హక్కుల పరిరక్షణకు సర్థార్ చిత్తశుద్ధితోపాటు పడుతున్నారని చెన్నితల తెలిపారు.ఈ సందర్భంగా పురుషోత్తమరావు పటేల్ స్పందిస్తూ, తన సేవాభావం, అంకితభావం, చిత్తశుద్ధిని గుర్తించి సంస్థ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించిన అధ్యక్షులు ప్రకాష్ చెన్నితలకు, సహకరించిన సంస్థ రాష్ట్ర విభాగం అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ పటేల్, కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణకు తన శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.