Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్‌లోని అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
- ఆదివాసీ, జానపదంపై జయధీర్ తిరుమల్‌రావు, మనోజ ప్రసంగం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివాసీ, గిరిజన జానపద వస్తు సంచయానికి అరుదైన గౌరవం లభించింది. కొన్ని వందల ఏండ్లుగా విస్మరణకు లోనవుతున్న జన సంస్కృతి, చరిత్రకు సంబంధించిన అమూల్యమైన ఆనవాళ్లను 'ఆద్యకళ' ద్వారా జన బాహుళ్యంలోకి తెచ్చిన ఆచార్య జయధీర్ తిరుమల్‌రావు, సమన్వయకర్త ఆచార్య గూడూరు మనోలకు ఫ్రాన్స్‌లోని అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. ఇండో-యూరోపియన్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌లోని నాంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ వేదిక 'భారత్-ఆఫ్రికా, మానవీయ శాస్త్రాల సంభాషణ'అనే అంశంపై ఈనెల 13 నుంచి 16 వరకు జరిగే అంతర్జాతీయ సదస్సులో వారు పాల్గొంటారు. ఆద్యకళ బృంద పరిశోధనా కృషి, కళాఖండాల చారిత్రక విశేషాలు, ప్రదర్శనశాల ఏర్పాటు వంటి అంశాలపై పత్ర సమర్పణ చేస్తారు. ఆద్యకళ ప్రదర్శనలోని వస్తు సంస్కృతి, ముఖ్యంగా భారతీయ, తెలంగాణ ఆదివాసీ, గిరిజన, జానపద, సంచార సమూహాల సంగీత వాద్యాలు, లోహకళలు, రాతప్రతులు, పనిముట్లు, వంటి అంశాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఈనెల ఆరున పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సాంస్కృతిక రాయబారి విశాల్ వి శర్మతో ఆద్యకళ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.