Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి బీ కేటగిరీ (మేనేజ్ మెంట్) కోటాలో సీటొచ్చిన విద్యార్థులకు ఏ కేటగిరీ మాపఫ్ రౌండ్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం అ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాయల సతీష్ బాబు, ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రశేఖర్, ముఖ్య సలహాదారు దాసరి రవిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు బీ క్యాటగిరీలో సీటు కోసం లక్షలాది రూపాయలు అప్పు చేసి ప్రయివేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో చేర్పించారని తెలిపారు. తల్లిదండ్రుల కోరిక మేరకు కాళోజీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రయివేటు మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్‌లో నాలుగున్నరేండ్లకు మాత్రమే ఫీజు తీసుకునే విధంగా జీవో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 129, 130 వల్ల రాష్ట్రానికి చెందిన ఎంతో మంది విద్యార్థులకు వైద్యవిద్యను అభ్యసించే అవకాశం లభించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా నీట్ లో ర్యాంకు వచ్చి దరఖాస్తు చేసుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అవకాశం కల్పించాలని కోరారు. ఎంబీబీఎస్ మేనేజ్ మెంట్ కోటాలో స్థానిక విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ను అంగీకరించి ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు.