Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు సంబంధించిన ఫీజుల జీవోను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పెంచిన వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ప్రభుత్వమే బోధనా రుసుముల ద్వారా విద్యార్థులకు చెల్లించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు సంబంధించిన ఫీజులను ఖరారు చేయకుండా బీఈడీ, ఎంఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫీజుల జీవోను ఇవ్వకుండానే కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. 2022-25 విద్యాసంవత్సరాలకు టీఏఎఫ్ఆర్సీ నిర్దేశించిన ఫీజులను ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా ప్రకటించాలని కోరారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి సత్యప్రసాద్, నాయకులు సల్మాన్ బాగీ, రాజ్‌కుమార్, విజరు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామనీ, విద్యార్థులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.