Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసి నుంచి రూ.3,400 కోట్లు లూటీ
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్ బోస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ అండతోనే ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఎల్ఐసి నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్ బోస్ విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ అనిల్ అంబానీ వంటి కుటిల వ్యాపారికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దేశాన్ని దోచుకుంటున్న అంబానీ వంటి దొంగలకు రాఫెల్ డీల్ కాంట్రాక్ట్‌ను పొందేందుకు, ఫ్రెంచ్ పన్ను మాఫీకి మోడీ సహాయం చేశారన్నది నిజం కాదా?అంటూ ప్రశ్నించారు. దయనీయ స్థితిలో ఉన్న రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు సకాలంలో రుణాలు చెల్లించకపోతే జైళ్లకు పంపుతారనీ, అదే సమయంలో మోడీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి రూ.వేలకోట్ల రుణమాఫీని చేస్తున్నదని విమర్శించారు. రూ.3,400 కోట్ల ఎల్ఐసి డబ్బు ప్రమాదంలోకి పడడానికి మోడీ కారణమని తెలిపారు. ప్రధాని మోడీ తక్షణమే స్పందించి అనిల్ అంబానీకి చెందిన ఆస్తులను అమ్మి రూ.3,400 కోట్ల ఎల్ఐసీ రుణాన్ని రికవరీ చేయాలనీ, తద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.