Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్, హర్యానా రైతులకు నగదు చెల్లింపులు జరిగాయి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన 709 రైతు కుటుంబాలకు సీఎం కేసీఆచర్ ఈ ఏడాది మే 22న 1010 చెక్కులను పంపిణీ చేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గుర్తు చేశారు. ఆ చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదంటూ కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 1010 చెక్కుల్లో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని తెలిపారు. బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత మూడు నెలల సమయం లోపల ఆయా చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విధంగా చేయకపోవడం వల్ల మిగిలిన కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదనే విషయం తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. ఇది చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోటికాదని వివరించారు. సంబంధిత బ్యాంకులకు గడువుదాటిన తర్వాత డిపాజిట్ చేసినట్టు చెప్పుతున్న మిగిలిన చెక్కులకు మరికొంత సమయం ఇచ్చి, నగదు చెల్లింపులు జరిగేలా అనుమతిని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే రీవాలిడేట్ చేయాలంటూ ఆయా బ్యాంకులను కోరినట్టు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (రెవెన్యూ డిపార్ట్ మెంట్) రాంసింగ్‌ను 9581992577 నెంబరులో సంప్రదించాలని కోరారు.రైతులకు ఆర్థిక సహాయం అందేదాకా తెలంగాణ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు.
సీఎస్‌తో గోవింద్‌సింగ్ భేటీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కమిషనర్ ఆప్ ఎంక్వయిరీస్ సీఐడీ రిటైర్డ్ డీజీ గోవింద్‌సింగ్ గురవారం భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సీఐడీ డీజీపీగా ఇటీవల ఆయన పదవీ విరమణ చేశారు. ఆయన్ను ఎంక్వయిరీస్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.