Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమె పురస్కారానికి కెకె.రాజా అర్హుడు : హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ - కల్చరల్
పేద దళిత వర్గాల ప్రతినిధిగా ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో వారి హక్కుల కోసం ఈశ్వరీ బాయి గళమెత్తారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తు చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీ బాయి స్మారక నిధి నిర్వహణలో ఈశ్వరీబాయి 104వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయి-2022 స్మారక పురస్కారాన్ని సామాజిక కార్యకర్త కెకె.రాజాకు హోంమంత్రి ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పలు సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తూ దళితుల శ్రేయస్సును కాంక్షిస్తూ, ఆదర్శప్రాయ జీవితం గడుపుతున్న కె.కె.రాజా ఈశ్వరీ బాయి పురస్కారానికి అర్హుడని చెప్పారు. రాష్ట్రంలో ఈశ్వరీబాయి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణ మాట్లాడుతూ.. ధీర మహిళ ఈశ్వరీబాయి వారసత్వాన్ని మాజీ మంత్రి గీతారెడ్డి పునికిపుచ్చుకున్నారని చెప్పారు. కెకె.రాజా జీవితం ఆదర్శప్రాయం అన్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈశ్వరీబాయి ఎలాంటి రాజకీయ ప్రభావాలు లేకుండా దళిత ఉద్యమం నడిపారని, నేడు అలాంటి మరో ఉద్యమం అవసరముందన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలకు గురుకుల విద్యాలయాల కోసం తొలిసారిగా పోరాటం చేసిన ఈశ్వరీబాయి పురస్కరం రాజాకు బహూకరించటం సముచితమని చెప్పారు. ట్రస్ట్ స్థాపకులు డాక్టర్ గీతా రెడ్డి నివేదిక సమర్పించగా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు జె. బిరాజు, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.