Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యయనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు గురువారం ఉన్నత విద్యామండలి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఎస్ రామచంద్రం చైర్మెన్‌గా జేఎన్టీయూ హైదరాబాద్ రెక్టార్ ఎ గోవర్ధన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ సభ్యులుగా ఆ కమిటీలో ఉన్నారు. అయితే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటిని అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చేయాలన్న దానిపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కొన్ని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్మీడియెట్‌లో కొన్ని సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వాటితోపాటు అదనంగా కొన్ని సబ్జెక్టులను చదివినా కొన్ని కోర్సుల్లో చేరేందుకు అర్హత కల్పిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొందాలంటే ఇప్పటి వరకు మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా ఇంటర్లో చదివిన వారే అర్హులు. ఇప్పుడు బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ చదివిన వారూ అర్హులేనని పేర్కొంది. ఆర్కిటెక్చర్లో ఏఐసీటీఈ సూచించిన 14 సబ్జెక్టులైన ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టు, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి సబ్జెక్టుల్లో ఏదో ఒకటి చదివిన వారే ఆ కోర్సులో చేరేందుకు అర్హులుగా ఉంటారు. ప్లానింగ్‌లో ప్రస్తుతం మ్యాథ్స్ తప్పనిసరిగా చదవాలి. అయితే 14 సబ్జెక్టుల్లో ఏదో ఒకటి చదివిన వారూ ఆ కోర్సులో చేరేందుకు అవకాశమున్నది. బయోటెక్నాలజీ ఇంజినీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్‌లో ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదవాలి. ఇప్పుడు 14 సబ్జెక్టుల్లో ఏ ఒక్కటి చదివినా ఆ కోర్సులో చేరొచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో ప్రస్తుతం మ్యాథ్స్, ఫిజిక్స్ చదిదిన వారే చేరేందుకు అర్హులుగా ఉన్నారు. ఇకనుంచి 14 సబ్జెక్టుల్లో ఏదో ఒకటి ఇంటర్లో చదివిన వారూ అర్హులేనని ఏఐసీటీఈ ప్రకటించింది.